* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలోని గోవిందరావుపేట, తాడువాయి, ఏటూర్ నాగారం మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో సజావుగా జరుగుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు.
గోవిందరావు పేట మండల పసర గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో, ఎస్ .ఎస్. తాడ్వాయి మండలం మేడారం లోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఓటరు జాబితాలో ఓటర్ల క్రమ సంఖ్య సరిచూసుకొని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. పోలింగ్ నిర్వహణను, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోటీ చేయు సర్పంచి, వార్డు సభ్యుల జాబితాను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలనీ స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారికి ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఒకటి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రం గేటు లోపలికి అనుమతించకూడదనీ ఎన్నికల అధికారులను ఆదేశించారు.
పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది డ్యూటీలు, ఓటర్ల సౌకర్యాలపై సమాచారం సేకరించి, పలు సూచనలు చేశారు. పోలింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యం చోటుచేసు కోకూడదని, ప్రతి ఓటరికి సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ, పారదర్శకత, నిబంధనల పాటింపు అత్యంత ముఖ్యం అని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవంతరాలు, ఇబ్బందులు ఏర్పడకుండా ఓటర్లకు అన్ని ఏర్పాట్లు చేసి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఎన్నిక పూర్తి అయిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు.
……………………………
