*కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం…
*మున్సిపల్ పోరులో మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా!
ఆకేరు న్యూస్,కరీంనగర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారం ఇందిరా భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ అభివృద్ధికి, అవినీతి రహిత పాలనకు కాంగ్రెస్ పార్టీయే ఏకైక ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు.గత ప్రభుత్వ హయాంలో కరీంనగర్ అవినీతికి నిలయంగా మారిందని మంత్రి మండిపడ్డారు.మానేరు రివర్ ఫ్రంట్, కుంగిపోయిన తీగల వంతెన వంటి పనుల్లో భారీగా అవినీతి జరిగిందని, స్మార్ట్ సిటీ పనులు కేవలం ప్రధాన రోడ్లకే పరిమితమయ్యాయని ఆరోపించారు.కేంద్ర నిధుల్లో అవినీతి జరిగిందని స్వయంగా కేంద్ర మంత్రే చెప్పినా, చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు.మేయర్‌ను ‘అవినీతి అనకొండ’ అని పిలిచిన వారే, ఇప్పుడు ఆయనను తమ పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు.
ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే అనేక హామీలను నెరవేర్చిందని మంత్రి వివరించారు.గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని తెలిపారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు, దేశంలోనే తొలిసారిగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (80% మందికి లబ్ధి), మరియు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని చెప్పారు.70 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ చేపట్టామని, కరీంనగర్లో లా కాలేజీని ప్రారంభించి, మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను వేగవంతం చేశామని వెల్లడించారు.మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కరీంనగర్ రూపురేఖలు మార్చడమే తమ లక్ష్యమని పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.నగరంలో ప్రతి డివిజన్ వారీగా ఆఫీసులు ఏర్పాటు చేసి, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో అవినీతి లేని సేవలు అందిస్తామని చెప్పారు.ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న డంపింగ్ యార్డ్‌ను తరలించి, శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.కరీంనగర్ రింగ్ రోడ్డు ఏర్పాటుతో పాటు తాగునీరు, డ్రైనేజీ మరియు పార్కుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.బీఆర్ఎస్ మరియు బీజేపీలు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. మతం పేరుతో రాజకీయం చేస్తూ అభివృద్ధిని విస్మరించారని, శాతవాహన యూనివర్సిటీ, పాస్‌పోర్ట్ కేంద్రం, రైల్వే వంటివి కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని గుర్తుచేశారు. ఈ ఎన్నికలు ‘అవినీతికి – నిజాయితీకి’ మధ్య జరుగుతున్న పోరాటమని, పారదర్శక పాలన కోసం కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని కోరారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
