* కార్యాచరణ ప్రారంభించిన ఎన్నికల కమిషన్
* తాజాగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
* జనవరి 20 లోపు షెడ్యూల్ విడుదల?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : త్వరలోనే మునిసిపాలిటీ ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఆ మేరకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తోంది. తాజాగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం సమావేశమైంది. ఎస్ఈసీ రాణి కుముదిని (Sec Rani Kumudhini) మునిసిపల్ ఎన్నికలపై ఆయా ప్రతినిధులతో చర్చించారు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రతినిధుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను బుధవారమే ఆమె సూచించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ తో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తదితర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వమించారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు, ఫ్లయింగ్ సర్వెలెన్స్ టీంల(ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వెలెన్స్ టీం(ఎస్స్టీ)ల నియామకం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కాగా తెలంగాణలో గడువు ముగిసిన 117 మున్సిపాల్టీ పాలకవర్గాలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి షెడ్యూల్ ఈ నెల 20వ తేదీ లోపు విడుదలయ్యే అవకాశం ఉంది.
………………………………….

