Constable Suicide
* కానిస్టేబుల్ ఆత్మహత్య
* హైదరాబాద్ మూసారాంబాగ్ పరిధిలో ఘటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మూసారాంబాగ్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. అంబర్పేట్ హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న ముత్తె చంద్రశేఖర్ (35) తన ఇంట్లో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు. ఇతడి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
యువతికి వీడియో కాల్ చేసి..
పోలీసుల కథనం ప్రకారం.. చంద్రశేఖర్ అర్ధరాత్రి సమయంలో ఓ యువతికి వీడియో కాల్ చేశారు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడిన అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమెకు తెలిపారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ యువతి, వెంటనే చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు, ఘటన జరిగిన ప్రాంతం మలక్‌పేట్ స్టేషన్ పరిధిలోకి రావడంతో తక్షణమే మలక్‌పేట్ పోలీసులను అప్రమత్తం చేశారు.
అప్పటికే తాడుకు వేలాడుతూ..
సమాచారం అందుకున్న వెంటనే మలక్‌పేట్ పోలీసులు హుటాహుటిన శాలివాహన నగర్‌లోని చంద్రశేఖర్ నివాసానికి చేరుకున్నారు. అయితే అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయి వేలాడుతూ కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. చంద్రశేఖర్ ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదని, అతడి ఫోన్ డేటా, ఆ యువతితో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘోరానికి కుటుంబ సమస్యలా లేదా ఇతర వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
