Warangal CP N Shweta visited the Narsampet De Addiction Centre and directed officials to provide better Medical Treatment.
* పోలీస్, వైద్య శాఖలు కలిసి పనిచేయాలి
* నర్సంపేట డి-అడిక్షన్ కేంద్రానికి సీపీ కీలక సూచనలు
ఆకేరు న్యూస్, నర్సంపేట : వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ బుధవారం నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్వహిస్తున్న డి-అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.
* వ్యసన బాధితులను నేరస్థులుగా చూడొద్దు..
ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి అందిస్తున్న వైద్య చికిత్స, కౌన్సెలింగ్, పునరావాస సేవల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వ్యసన బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వారు మాదకద్రవ్యాల వ్యసనం నుంచి పూర్తిగా బయటపడేలా నిరంతర పర్యవేక్షణ, తగిన చికిత్స, కౌన్సెలింగ్ అందించాలని వైద్య సిబ్బందికి తెలిపారు.
మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీస్ శాఖతో పాటు వైద్య శాఖ సమన్వయంతో పనిచేయడం ఎంతో కీలకమని సీపీ పేర్కొన్నారు. వ్యసనానికి గురైన వారిని నేరస్థులుగా కాకుండా బాధితులుగా పరిగణించాలని సూచించారు. వారికి అవసరమైన వైద్య సహాయం, మానసిక ధైర్యం కల్పించాలన్నారు. తిరిగి సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా ప్రోత్సహించాలని తెలిపారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీపీ పిలుపునిచ్చారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
* మెరుగైన వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు కల్పించాలి..
అనంతరం డి-అడిక్షన్ కేంద్రాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని నర్సంపేట ఇన్స్పెక్టర్కు సూచించారు. వ్యసన బాధితులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రంలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వసతులు అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్, నర్సంపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డ్రగ్ కంట్రోల్ టీం ఇన్స్పెక్టర్ సాయిరమణ, ఆర్ఎస్సై పూర్ణచందర్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దామోదరిబాయి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య, డి-అడిక్షన్ సెంటర్ ఇన్చార్జి డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

