
* తిరువనంతపురం జాతీయ సమావేశాల్లో డిమాండ్
* సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆవిర్భావం
* నేషనల్ కౌన్సిల్ లో తెలంగాణ నుంచి నలుగురికి స్థానం
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశవ్యాప్తంగా సీనియర్ జర్నలిస్టుల పరిస్థితి దుర్బలంగా, అనిశ్చితంగా ఉందని వారికి జాతీయ పెన్షన్ పథకం అమలు చేయాలని సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ జే ఎఫ్ఐ) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కేరళలోని తిరవనంతపురంలో జరిగిన మూడు రోజుల సీనియర్ జర్నలిస్టుల జాతీయ సమావేశాల్లో సీనియర్ జర్నలిస్టుల సమస్యలపై చర్చించిన తర్వాత పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల సీనియర్ జర్నలిస్టులతో ఏర్పడిన “సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా”(ఎస్ జే ఎఫ్ఐ) తీర్మానాలు చేసి ఆమోదించడం జరిగింది. దేశవ్యాప్తంగా సీనియర్ జర్నలిస్టుల పరిస్థితి దుర్బలంగా, అనిశ్చితంగా ఉందని, చాలా రాష్ట్రాల్లో, జర్నలిజం వృత్తి నుంచి పదవీ విరమణ చేసిన జర్నలిస్టులు వివిధ అనారోగ్యాలు, కుటుంబ ఆర్థిక భారాలు, ఒంటరితనం వంటి అనేక సమస్యల మధ్య తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని సమావేశంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. సరైన ఆదాయం లేకపోవడంతో ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడం సవాలుగా మారిందని, చాలా మంది విషయంలో స్వీయ,జీవిత భాగస్వామి వైద్య ఖర్చులు భరించలేనంత ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఈ తీవ్రమైన పరిస్థితిని చాలా అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని, అందువల్ల సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ మొదటి జాతీయ సమావేశం దేశవ్యాప్తంగా అర్హత కలిగిన సీనియర్ జర్నలిస్టులందరినీ కవర్ చేసే జాతీయ పెన్షన్ పథకాన్ని అత్యవసరంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది.
ఎస్ జేఎఫ్ ఐ ఆవిర్భావం
కేరళలోని తిరువనంతపురం లో మూడు రోజుల పాటు జరిగిన సీనియర్ జర్నలిస్టుల జాతీయ సమావేశాల్లో “సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ జేఎఫ్ ఐ) ఆవిర్భవించింది. ఈ జాతీయ సంఘం అధ్యక్షుడిగా సందీప్ దీక్షిత్ (ఢిల్లీ), ఉపాధ్యక్షులుగా ఆనందం పులిపలుపుల (తెలంగాణ), సుహాసిని ప్రభుగోంకర్ (గోవా), డాక్టర్ టి.జనార్దన్ (ఆంధ్ర ప్రదేశ్), చందర్ ప్రకాష్ భరద్వాజ్(మధ్యప్రదేశ్), ప్రధాన కార్యదర్శిగా ఎన్ పీ చెకుట్టి (కేరళ), కార్యదర్శులుగా కె. శాంతకుమారి (కర్ణాటక), కన్హు నందా (ఒడిశా), ఆర్. రంగరాజన్ (తమిళనాడు), జైపాల్ పరశురామ్ పాటిల్ (మహారాష్ట్ర),కోశాధికారిగా కె.పి.విజయకుమార్(కేరళ), కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా ఆర్ పీ సాంబసదాశివ రెడ్డి(కర్ణాటక), జార్జ్ కల్లివయలిల్ (ఢిల్లీ), ఎస్. సభానాయకన్ (పశ్చిమ బెంగాల్),రిమా శర్మ (అస్సాం),అభిజీత్ పాండే (బీహార్),అశ్వనీ కుమార్ (జమ్మూ కాశ్మీర్), ఉపేంద్ర సింగ్ రాథోడ్, (రాజస్థాన్), ప్రదీప్ ఫుటేల (ఉత్తరాఖండ్), సుమమా ఔసల్ (జార్ఖండ్),పి. పరమేశ్వర రావు(ఆంధ్ర ప్రదేశ్) తదితరులతో పాటు పలువురు నేషనల్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేషనల్ కౌన్సిల్ లో తెలంగాణ నుంచి వల్లాల జగన్, శ్రీనివాస రెడ్డి, సారంగపాణి, మహ్మద్ రఫి లకు స్థానం లభించింది
………………………………….