
ఆకేరు న్యూస్, ములుగు: వాగులో చిక్కుకున్న నలుగురిని ఎన్డీఆర్ ఎఫ్ బృందం కాపాడిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి లో సోమవారం పశువులను మేపుటకు వెళ్ళిన దుబారి రామయ్య, చేపలు పట్టుటకు వెళ్ళిన పి. సాయికిరణ్, రాజబాబు, పి. రాములు సాయంత్రం ఇంటికి రాలేదు. అంతేకాకుండా సమిపంలోని వాగు ప్రవాహం పెరుగుతుండటంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈక్రమంలో రామయ్య సోదరుడు స్థానిక తహసీల్దార్ సురేష్ బాబుకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా, తహసిల్దార్ కలెక్టర్ కు వివరించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి రాత్రి 11 గంటలకు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ నేతృత్వం లో ఎన్టీఆర్ బృందం కాల్వపల్లికి చేరుకొని వరదలో చిక్కుకున్న వారిని కాపాడింది. వాగు ప్రవాహం ఎక్కువ ఉండటంతో తాడు సహాయంతో వాగు దాటి పశువుల కాపరి రామయ్యను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వాగు నుంచి కిలో మీటర్ ముందుకు పోయి వెతికి సాయికిరణ్, రాజాబాబు, రాములను గుర్తించి వారిని సురక్షితంగా వాగు దాటించారు. వీరందనికీ కుటుంబ సభ్యులకు అప్పగించారు.
………………………………