
* ఇకనైనా ఇలాంటి దారుణాలు ఆగేనా?!
* నిపుణుల కమిటీ ఏం చేయబోతోంది?
* సిగాచి ఫ్యాక్టరీని సందర్శించిన బృందం
* పేలుడు ఘటనపై విచారణ
* నెల రోజుల్లో నివేదిక
* ఆ నివేదికను బట్టే కార్మికుల భవితవ్యం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
సిగాచి కంపెనీ వద్ద నలుగురితో కూడిన నిపుణుల బృందం అధ్యయనం చేపట్టింది. పేలుడు ఘటనపై పరిశీలన జరిపింది. కార్మికుల భద్రతకు నిబంధనలు పాటించారా.. లేదా అన్న దానిపై బృందం సభ్యులు విచారణ చేపట్టారు. నిపుణుల కమిటీ నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆ కమిటీ ఇవ్వబోయే నివేదిక, సిగాచి కంపెనీపై తీసుకునే చర్యలను బట్టే మున్ముందు ఇలాంటి ప్రమాదాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో పరిశ్రమల్లో జరుగుతున్న విషాదాలు, ప్రభుత్వ విభాగాల తీరుపై “ఆకేరు న్యూస్” ప్రత్యేక కథనం..
బాధ్యతలు పట్టవా?
పాశమైలారంలో జరిగిన ప్రమాదం ఘోరాతి ఘోరం. దాదాపు 40 మందిని బలి తీసుకుంది. వారిపై అధారపడిన వందలాది మందిని నిరాశ్రయులను చేసింది. బతికున్నవారు కూడా పని చేయగలరో లేదా తెలియదు. పేలుడు వల్ల విడుదలైన అధిక ఉష్ణోగ్రతకు వారి లోపల అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు చెబుతున్నారు. తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం. ఈ ప్రమాదంలో మా తప్పు లేదంటే.. మా తప్పు లేదని ప్రభుత్వ విభాగాలైన పీసీబీ, ఫ్యాక్టరీల విభాగం పేర్కొంటున్నాయి. కానీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించినా, ఎటువంటి ప్రమాదం జరిగినా దాని నిర్వహణా లోపాలే కారణం. సరిగా నిర్వహణ చేపట్టని పరిశ్రమ యాజమన్యాలు.. నిర్వహణ చేపట్టేలా కఠిన చర్యలు తీసుకోలేని ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యమే ముమ్మాటికీ కారణం. కానీ ఎవరికి వారు తమ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు.
చెప్పారు సరే.. విన్నారో లేదో పట్టించుకోరా?
పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో తప్పు మాది కాదంటే.. మాది కాదంటూ.. ప్రభుత్వ విభాగాలు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని కార్మిక సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీలో కార్మికుల భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై సిగాచి యాజమాన్యానికి ఏడాది క్రితమే సిఫారసులు చేశామని, వారు విస్మరించారని ఫ్యాక్టరీల విభాగం చెబుతోంది. అయితే.. భద్రతా సిఫారసులను కచ్చితంగా అమలు అయ్యేలా ఎందుకు చర్యలు చేపట్టలేదని అధికారులను కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సిగాచి ఫ్యాక్టరీలో ఇంతకు మునుపు ఒకసారి పేలుడు సంభవించినా అటు ఫ్యాక్టరీ యాజమాన్యం, ఇటు ప్రభుత్వ విభాగాల అధికారులు సరైన చర్యలు తీసుకోలేదు. దీంతో ఇప్పుడు తీవ్రమైన విషాదం మిగిలింది.
మిగతా పరిశ్రమల్లో పరిస్థితేంటి?
సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదానికి పాత మిషనరీ వాడడమే కారణమని, ఈ ప్రమాదంలో అసువులు బాసిన ఓ కార్మికుడి కుమారుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అత్యధిక ఉష్ణోగ్రతను భరించాల్సిన పరికరాల్లో చాలా పాతవే ఉన్నాయని, తన తండ్రి చాలాసార్లు వాపోయేవాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీన్నిబట్టి.. ఆ కంపెనీలో పని చేస్తున్న చాలా మంది కార్మికులు భయం భయంగానే ఉపాధి నిమిత్తం విధిలేని స్థితిలో అక్కడ పనిచేస్తున్నారన్న విషయం సాయి యశ్వంత్ ఫిర్యాదును బట్టి అర్థం చేసుకోవచ్చు. భారీ ప్రమాదం జరిగింది కాబట్టి సిగాచి ఫాక్టరీలోని లోపాలు బయటకు రావచ్చు. మరి మిగతా పరిశ్రమల పరిస్థితి.
పటాన్ చెరులోనే 4020 వరకు పరిశ్రమలు
తెలంగాణలో వేలాది పరిశ్రమలు ఉన్నాయి. అత్యంత విషాదం చోటుచేసుకున్న పటాన్ చెరు నియోజవర్గంలోనే సుమారు 4020 వరకు పరిశ్రమలు ఉండగా, వీటిలో 1960 రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో 2.50 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తున్నారు. వీరే కాకుండా ఉద్యోగులు వేల సంఖ్యలో పనిచేస్తున్నారు. కానీ, పరిశ్రమల్లో ప్రమాదాలు నివారించేందుకు యాజమాన్యాలు కనీస సౌకర్యలు కల్పించక పోవడంతో కార్మికులకు రక్షణ లేకుండా పోతున్నది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడకు నెలవైన పటాన్‌చెరులోనే ఈ దుస్థితి ఉంటే.. మిగతా చోట్ల అర్థం చేసుకోవచ్చు. దేశంలోని అనేక రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఇక్కడి పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పరిశ్రమల్లో పని చేసేందుకు కార్మికులను కాంట్రాక్టర్లు తీసుకువస్తున్నారు. కానీ, కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పరిశ్రమల యాజమాన్యాలు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిపుణుల కమిటీ కఠిన చర్యలు చేపట్టేనా?
సిగాచీ పరిశ్రమ ప్రమాదంపై అధ్యయనం చేసేందుకు నిపుణుల బృందం కేంద్రం నుంచి వచ్చింది. పేలుడు గల కారణాలు ఏంటి? ఎంత మంది చనిపోయారు? దీని వెనుక ఎవరి నిర్లక్ష్యం ఉంది? అనే వివరాలను ఆరా తీసినట్లు తెలిసింది. అధ్యయనం అనంతరం ఆ కమిటీ ఓ నివేదిక తయారు చేయనుంది. సిగాచి ప్రమాదానికి గల కారణాలతో పాటు, పరిశ్రమల్లో మున్ముందు ఇలాంటి ప్రమాదాలకు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిపుణుల కమిటీ చర్చించనుంది. అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. అయితే ఆ నివేదికలో పరిశ్రమల్లో నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా ప్రభుత్వ విభాగాల పనితీరు ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు కంపెనీలను తనిఖీలు చేయాలి. పరికరాలను పరిశీలించాలి. కార్మికుల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై క్షుణ్నంగా పరిశీలించాలి. నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టని యాజమాన్యాల పట్ల కఠినంగా వ్యవహరించాలి. అప్పుడే ఇలాంటి ప్రమాదాలకు కొంచెమైనా అడ్డుకట్ట పడే అవకాశాలు ఉంటాయి. నిపుణుల బృందం ఇవ్వబోయే నివేదికను బట్టే కార్మికుల భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
…………………………………………………..