
* రెండేళ్లలో రూ.3.80 కోట్లు కొట్టేశారు
* పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
ఆకేరు న్యూస్ డెస్క్: సోషల్ మీడియా ద్వారా పరిచయమైన మహిళల వలలో చిక్కి కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.3.80 కోట్లు పోగొట్టుకున్నాడు. నగ్న వీడియోలు, అసభ్యకరమైన మాటలతో నమ్మించి, రెండేళ్ల పాటు విడతల వారీగా ఈ భారీ మొత్తాన్ని వసూలు చేసిన తెలంగాణకు చెందిన ముగ్గురు సభ్యుల ముఠాను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు.పోలీసుల కథనం ప్రకారం నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన చిక్కిరి మల్లేశ్, అతడి భార్య పెరుమాళ్ల మేరీ, వారి సన్నిహితురాలు మొల్లం మల్లిక అలియాస్ లిల్లీ కలిసి సులభంగా డబ్బు సంపాదించాలని పథకం పన్నారు. ఇందుకోసం ‘సంయుక్త రెడ్డి’ అనే పేరుతో ఓ నకిలీ ట్విట్టర్ ఖాతా సృష్టించారు. ఈ ఖాతా ద్వారా కర్నూలుకు చెందిన వ్యక్తిని పరిచయం చేసుకున్నారు. అతడి నమ్మకాన్ని చూరగొనేందుకు ముందుగా న్యూడ్ వీడియోలు పంపి, ఆ తర్వాత ఓ మహిళతో అసభ్యకరంగా వాట్సాప్ వీడియో కాల్ చేయించి రెచ్చగొట్టారు.అంతటితో ఆగకుండా, తక్కువ ధరకే పొలాలు, స్థలాలు ఇప్పిస్తామంటూ కట్టుకథలు అల్లి పూర్తిగా నమ్మించారు. వారి మాటలు నిజమని భావించిన బాధితుడు, సుమారు రెండేళ్ల కాలంలో పలు దఫాలుగా మొత్తం రూ.3.80 కోట్లను వారి ఖాతాలకు బదిలీ చేశాడు. ఈ డబ్బుతో నిందితులు రూ.41.26 లక్షలు వెచ్చించి రెండు కార్లు, ఓ బైక్, బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. మిగిలిన రూ.3.38 కోట్లను విలాసవంతమైన జీవితానికి, ఇతర ఖర్చులకు వాడేశారు.చివరకు తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న కర్నూలు రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితులు ముగ్గురినీ అరెస్టు చేసినట్లు సీఐ నాగరాజారావు శుక్రవారం మీడియాకు తెలిపారు.
……………………………………