* కొత్తగా మరిన్ని జోన్లు, డివిజన్లు
* పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తొద్దు
* ఆలస్యమైనా నిశితంగా అధ్యయనం చేయండి
* అధికారులకు సర్కారు ఆదేశాలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం చుట్టే కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిని అమాంతంగా పెంచేయడంతో రూపకల్పన ఎలా అనేదానిపై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. 700 చ.కి.మీల విస్తీర్ణంలో ఉన్న మహానగరం దాదాపు 2000 చ.కి.మీల విస్తీర్ణంతో మహ మహానగరంగా మారనుండడంతో ఆ దిశగా కసరత్తు మొదలైంది. విస్తీర్ణం పరంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ దాదాపు మూడింతలు అవుతుండడంతో రూపకల్పనలో ఎక్కడ చిన్న సమస్య తలెత్తినా అది అతిపెద్ద అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి
‘కాస్త ఆలస్యమైనా పర్వాలేదు. భవిష్యత్‌లో ఎప్పుడూ పాలనాపరంగా ఎక్కడా ఇబ్బందులు తలెత్తొద్దు. నిశితంగా అధ్యయనం చేయండి. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి.’ అని కొత్త జీహెచ్ఎంసీ రూపకల్పనకు సంబంధించి అధికారులకు సర్కారు నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం ఉన్న జోన్లు, డివిజన్లు ఎలా ఉన్నాయి. రెండు నియోజకవర్గాల్లో కలిసి ఉన్నవి ఏవి? కొత్తగా చేరేవి అనే అంశాలను ఇప్పటికే పరిశీలించిన అధికారులు వేగంగా అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఆరు జోన్లు ఉన్నాయి. కొత్తగా విలీనమవుతున్న ప్రాంతాలను ఏ జోన్ కలిపితే సౌకర్యంగా ఉంటుందన్న అంశాన్ని ప్రధానంగా పరిగణలోకి విలీన ప్రక్రియను అధికారులు చేపట్టారు.
పెరగనున్న జోన్లు
నగర శివారులో ఉన్న ఎల్బీనగర్ జోన్లో పెద్ద అంబర్‌పేట, తుర్కయాంజాల్,ఆదిభట్ల మునిసిపాలిటీలను కలపనున్నారు. అదేవిధగా బోడుప్పల్, ఫీర్జాదిగూడ, పోచారం,ఘట్ కేసర్ మునిసిపాలిటీలతో కొత్తగా మరో జోన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నాగారం, దమ్మాయిగూడ, జవహర్‌నగర్, తూంకుంట మునిసిపాలిటీలను సికింద్రాబాద్ జోన్లో కలపడమా, లేక కొత్తగా శివారు ప్రాంతంలో మరో కొత్త జోన్‌ను ఏర్పాటు చేయాలన్నదానిపై కసరత్తు జరుగుతోంది. కొత్తగా విలీనమయ్యే మునిసిపాలిటీలతో జోన్ల సంఖ్యను పెంచే ఆలోచన చేస్తున్నారు.
శంషాబాద్పై ప్రధాన ఫోకస్
ఇందులో ప్రధానంగా నగరానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న శంషాబాద్ మునిసిపాలిటీని విలీనం చేయడంతో పాటు శంషాబాద్ పేరుతో కొత్తగా జోన్‌ను ఏర్పాటు చేసి, అందులోకి కొత్తగా జల్పల్లి, బండ్లగూడ జాగీర్, తుక్కుగూడ మునిసిపాలిటీలను కలిపేందుకు అవకాశం ఉంది. జీహెచ్ఎంసీలో ఒక జోన్‌గా ఉన్న చార్మినార్‌కు శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న బండ్లగూడ జాగీర్ మునిసిపల్ కార్పొరేషన్‌తో పాటు జల్పల్లి మునిసిపాలిటీ, అదేవిధంగా శంషాబాద్, తుక్కుగూడ మునిసిపాలిటీలను చార్మినార్ జోన్ పరిధిలోకి తీసుకు వస్తారని ప్రచారం జరుగుతోంది.
క్లస్టర్లు, డివిజన్లు
గ్రేటర్ శివార్లలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనానికి ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టడంతో ఏ మునిసిపాలిటీ ఏ జోన్ పరిధిలోకి వస్తుందన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా నగరానికి పడమర దిక్కున ఉన్న వెస్ట్ హైదరాబాద్ (ఐటీ కారిడార్) పరిధిలో ఉన్న మణి కొండ, నార్సింగి మునిసిపాలిటీలను శేరిలింగంపల్లి జోన్లో కలిసి ఈ రెండింటిని ఒక సర్కిల్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కొత్తగా మరిన్ని క్లస్టర్లు, డివిజన్లు, సర్కిళ్లు, జోన్లు ఆవిర్భవించనున్నాయి. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 150 డివిజన్లు ఉండగా ఆ సంఖ్య 250 నుంచి 300 అయ్యే అవకాశాలు ఉన్నాయి.
…………………………………………………….
