* రాజకీయ తెరపైకి కొత్త ముఖాలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
కాంగ్రెస్ సర్కారు తీసుకున్న పునర్విభజన నిర్ణయంతో రాజకీయంగా కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. 150 డివిజన్లు గల జీహెచ్ఎంసీ శివారు ప్రాంతాలతో కలుపుకుని 300 డివిజన్లు కావడం కొందరికి వరంగా మారింది. మరో 150 మందికి కార్పొరేటర్లుగా అవకాశం దక్కనుంది. ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొత్తవాళ్లు కూడా పుట్టుకొస్తున్నారు. దీంతో అప్పుడే ఎన్నికల సందడి మొదలైందా అంటే అవును అన్నట్లుగానే వాతావరణం కనిపిస్తోంది.
150 నుంచి 300
వార్డుల పునర్విభజన జీహెచ్ఎంసీ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పటివరకు 150 డివిజన్లతో ఉన్న మహానగరం 300 డివిజన్లకు చేరుకుంది. ఈ మార్పు కేవలం పరిపాలనా పరమైనదిగా కాకుండా, రాజకీయంగా కీలక మలుపుగా మారింది. డివిజన్ల పెంపుతో పాటు కార్పొరేటర్ల సంఖ్య పెరగడం, టికెట్ల కోసం ఆయా పార్టీల నాయకుల చుట్టూ ఆశావాహులు ప్రదక్షిణలు మొదలుపెట్టినట్టు సమాచారం. పునర్విభజనలో పాత డివిజన్ల పేర్లను మార్చకపోయినా, ఓటర్ల సంఖ్య, జనాభా పెరుగుదల నేపథ్యంలో కొన్ని డివిజన్లను రెండు, మూడు భాగాలుగా విభజించారు.
కొత్త డివిజన్లలో కొత్త ముఖాలు
ఉదాహరణకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, శేరిలింగంపల్లి, చందానగర్, హఫీజ్‌పేట, మియాపూర్, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, వివేకానందనగర్ వంటి పాత డివిజన్లు యథాతథంగా ఉండగా.. నల్లగండ్ల, మసీదుబండ, అంజయ్యనగర్, శ్రీరామ్‌నగర్, హైటెక్‌సిటీ, ఇజ్జత్‌నగర్, మదీనాగూడ, మాతృశ్రీనగర్, దీప్తిశ్రీనగర్, బీకేఎన్ ఎన్క్లేవ్, మయూరినగర్, భాగ్యనగర్, షంషీగూడ, కమలప్రసన్ననగర్ వంటి 14 కొత్త డివిజన్లు రూపుదిద్దుకున్నాయి. కొత్త డివిజన్లలో రాజకీయంగా కొత్త ముఖాలు తెరపైకి వచ్చాయి. పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి.
పోటీకి సై
రాజధాని హైదరాబాద్‌లో కార్పొరేటర్ల సంఖ్య డబుల్ కానుంది. ఇది రాజకీయ ఆశావాహులకు పెద్ద అవకాశంగా మారింది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి ఆశావాహులు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగారు. రోజుకు 10 నుంచి 20 మంది వరకు తమ అనుచరగణంతో కలిసి స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అధిష్ఠానం పెద్దలను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ కోసం ముందస్తు లాబీయింగ్, శక్తి ప్రదర్శన ఇప్పటికే మొదలైంది. కొత్తగా ఏర్పడిన ప్రతి డివిజన్లో మూడు నుంచి ఐదుగురు వరకు అభ్యర్థులు పోటీకి సిద్ధమైతున్నట్టు తెలుస్తోంది.
పోటీ ఎక్కువే..!
పాత డివిజన్లలో పనిచేసిన కార్పొరేటర్లు కూడా ఈసారి కీలక పాత్ర పోషిస్తున్నారు. తమ డివిజన్ నుంచి విడిపోయి ఏర్పడిన కొత్త డివిజన్లలో తమ అనుచరులు లేదా విశ్వసనీయ వ్యక్తులను బరిలో దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో అంతర్గత రాజకీయాలు, గ్రూపుల పోరు పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సారి పోటీ తీవ్రంగా ఉండటంతో, ఒక పార్టీ నుంచి టికెట్ దక్కకపోతే మరో పార్టీలో చేరేందుకు కొందరు ఆశావాహులు ముందుగానే ప్రణాళికలు సిద్థం చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రె్‌సలో టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, బీఆర్ఎస్, బీజేపీల్లోనూ అదే స్థాయిలో ఆశావాహులు ఉన్నారు.
………………………………………………………..

