
* ఐసీయు కి తాళం
* సో పూర్ స్పెషాలిటీ హాస్పిటల్
* కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు నిర్లక్ష్యపు రోగం
* మూడు నెలలుగా ఆపరేషన్ లు లేవు
* తాగడానికి నీళ్లుండవు
* కూర్చోవడానికి కుర్చీలుండవు
* ఫ్యాన్లు లేక రోగుల ఉక్కిరిబిక్కిరి
* అరకొర వసతులతో రోగుల అవస్థలు
ఆకేరున్యూస్,హనుమకొండ జూన్ 1:
అదీ పేరుకే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.. నూటా యాభై కోట్ల రూపాయలతో నిర్మించిన ఏడంతస్తుల మేడ .. సాంకేతిక సమస్య పేరుతో అన్ని రకాల ఆపరేషన్ లను నిలిపి వేశారు..ఏకంగా ఐసీయూ విభాగానికి తాళం వేశారు. హనుమకొండ కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో ఉన్న ఈ ఆస్పత్రి పేరుకే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజానికి సౌకర్యాల లేమితో సో పూర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మారి పోయిందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ తరువాత తెలంగాణలో రెండో రాజధానిగా చెప్ప బడుతున్న వరంగల్ నగరంలో నిర్మించారు. రూ 120 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.30 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పీఎం ఎస్ ఎస్ వై పథకం కింద ఈ దవాఖానను ఏర్పాటు చేశారు. సామాన్యులకు మెరుగైన వైద్య ం అందించాలనే ఉద్దేశ్యంతో కార్పొరేట్ దవాఖానకు తీసిపోని విదంగా నిర్మించారు. గుండె సంబంధిత, ఇతర విభాగాలకు సంబంధించిన సేవలను కొనసాగించారు. ప్రతీ రోజూ ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్గఢ్ ల నుంచి కూడా పేదలు చికిత్స కోసం ఇక్కడికి వస్తుంటారు..
ఫ్యాన్లు లేక ఉక్కిరి బిక్కిరి
ఓపి విభాగానికి వచ్చే వందల సంఖ్యలో రోగులు ఫ్యాన్లు లేక ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు.సగం విరిగిన కుర్చీలతో కుస్తీలు పడుతున్నారు.. కనీసం తాగడానికి కూడా నీళ్లుండవు .. ఆరో అంతస్తులో నుంచి నీటి కోసం కిందికి రావాల్సిన దుస్థితి ఏర్పడింది..
లిఫ్టులు ఉన్నా పనిచేయవు
మొత్తం ఆరు లిఫ్ట్ లు ఉంటే అందులో నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయి అందులో రెండు లిఫ్టులు
డాక్లర్ల కోసం కేటాయించారు. రోగుల సంఖ్యకు సరిపడా లిఫ్టుల సౌకర్యం లేదు.. వయస్సు మళ్లిన వారు మెట్లు ఎక్క లేక నానా అవస్థలు పడుతున్నారు.. రోగుల సంఖ్యకు తగినన్ని టాయిలెట్లు కూడా లేక పోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
మూత పడ్డ విభాగాలు..
సెంట్రల్ ఏసీలు పనిచేయక పీడియాట్రిక్ సర్జరీ విభాగం.. ఐసీయూ విభాగాలకు తాళాలు వేశారు.కోట్లు ఖర్చు చేసి తెప్పించిన మిషనరీ ఎందుకూ పనికి రాకుండా పడి ఉంది.. గత మూడు నెలలుగా ఎలాంటి సర్జరీలు చేయడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి ఖరీదు చేసిన ఫర్నిచర్ సోఫా సెట్లు సగం విరిగడంతో ఓ మూలన పడేశారు. రోగులకు పంపిణీ చేసే మందుల్లో కోత విధిస్తున్నారు. సగం మందులే ఇచ్చి ఇదేంటని ప్రశ్నిస్తే మందులు లేవు మిగతావి బయట తీసుకోండనే సమాధానం వస్తుంది. కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేద మధ్య తరగతి వారికోసం ఏర్పాటు చేసిన ఈ దవాఖాన ఇప్పడు ఎందుకూ పనికిరాకుండా పోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఉద్దేశ్యం కొద్దీ ఈ దవాఖాన నిర్మించారో ఇప్పుడు ఆ ఉద్దేశ్యం నెరవేరకుండా దవాఖాన నిర్వహణ నీరుగారి పోతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు.
నెల రోజులుగా ఆపరేషన్ లు నిలిచి పోయింది నిజమే…
* డాక్టర్ కిశోర్ కుమార్, సూపరింటెండెంట్, ఎంజీఎం ఆస్పత్రి
ఏసీల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల ఆస్పత్రి లో ఇబ్బంది ఏర్పడింది..గత నెల రోజులుగా మేజర్ ఆపరేషన్ లు జరగడం లేదు. ఐసీయూ కి తాళం వేయడం ఇతరత్రా సమస్యలు నా దృష్టి కి రాలేదు ..సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లో నెలకొన్న ఇతర సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తాం
………………………………………………………..