
– డబ్బు చోరీ కోసం వెళ్లి బాలిక హత్య?
* ఓటీటీలో హర్రర్ మూవీలు చూసి ఘాతుకం
* 18సార్లు పొడిచి పొడిచి చంపేశాడు
* కూకట్పల్లి బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ
* పదో తరగతి చదువుతున్న బాలుడే నిందితుడు?
* ఆర్థిక పరిస్థితులూ ఈ దారుణానికి కారణమే
* హత్య పథకానికి మిషన్ డాన్ పేరు
ఆకేరు న్యూస్, హైదరాబాద్
పదో తరగతి చదువుతున్న ఆ బాలుడు.. ఓ బాలికను దారుణంగా చంపేశాడు. డబ్బు చోరీకి వెళ్లి అత్యంత దారుణంగా హతమార్చాడు. చోరీ చేసి వెళ్తుండగా చూసిన బాలికను గొంతు నులిమాడు. కిందపడిపోయిన ఆమెను ఏకంగా 18 సార్లు పొడిచి పొడిచి చంపేశాడు. ఎందుకు చంపావు అనే పోలీసు ప్రశ్నలకు బాలుడు ఒక్కోసారి ఒక్కో సమాధానం చెబుతున్నట్లు తెలిసింది. కూకట్పల్లి బాలిక హత్య కేసులో మిస్టరీ వీడింది. పక్కింటి కుర్రోడే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అధికారికంగా వివరాలు వెల్లడి కాకపోయినా పోలీసు విచారణ, దొరికిన ఆధారాలతో బాలుడి ఫొటో సహా విషయం వెలుగులోకి వచ్చింది.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తా క్యాసారం నుంచి బతుకుదెరువుకోసం నగరానికి వచ్చిన కృష్ణ, రేణుక దంపతుల కుమార్తె సహస్ర (12) నాలుగు రోజుల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. సహస్ర బోయిన్పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. ఆ దంపతుల కుమారుడు ఇంటికి సమీపంలోని బడికి వెళ్తున్నాడు. 18వ తేదీ ఉదయం క్రీడోత్సవాల కారణంగా సహస్ర చదివే పాఠశాలకు సెలవు ఇచ్చారు. తల్లిదండ్రులు పనులకు వెళ్లగా.. ఆమె తమ్ముడు సైతం స్కూల్ కి వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. తానే స్కూల్కు వెళ్లి తమ్ముడికి లంచ్బాక్సు ఇస్తానని బాలిక చెప్పినట్టు సమాచారం. అయితే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ‘లంచ్ బాక్సు తీసుకురాలేదేమంటూ’ స్కూల్ సిబ్బంది.. కృష్ణకు ఫోన్ చేయడంతో ఆయన హుటాహుటిన ఇంటికి వెళ్లారు. తలుపు బయట నుంచి గడియ పెట్టి ఉండటంతో ఓపెన్ చేసి చూడగా శరీరంపై కత్తిపోట్లతో మంచంపై విగతజీవిగా కనిపించింది ఆ బాలిక. కన్న కూతురిని అలా చూడలేక కుప్పకూలిపోయాడు
పక్కింటి కుర్రాడే హంతకుడు?
నిందితుడిని కనిపెట్టడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. బాలిక తల్లిదండ్రులు కృష్ణ, రేణుక స్నేహితులతో పాటు హత్య జరిగిన అపార్టుమెంట్ వాసులు సహా 40 మందికి పైగా విచారించారు. అయినా సరైన ఆధారాలు దొరక్క తల పట్టుకున్నారు. తొలుత అపార్ట్ మెంట్ లోనే వారే హత్య చేసి ఉంటారని భావించారు. కానీ తాజాగా పక్కింటి కుర్రోడే ఈ హత్య చేసినట్లు తెలిసి పోలీసులే నిర్ఘాంతపోయారు. పదేళ్ల బాలుడు ఇంత దారుణంగా చేయడంపై విస్మయానికి గురయ్యారు. నిందితుడు తాను బాలికను ఎందుకు చంపాననే వివరాలను పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించాడు. బాధితుల ఇంటి పక్కన బిల్డింగ్లో ఉంటున్న ఈ అబ్బాయి.. దొంగతనం కోసం బాలిక ఇంటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే చోరీ సమయంలో తనను బాలిక చూడటంతో.. ఆమె నిందితుడు దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది.
హార్రర్ మూవీలు చూసి..
ఓటీటీలో హర్రర్ మూవీలు చూసి నేరాల బాట పట్టినట్లు తెలుస్తోంది. బాలుడి అవసరాల నిమిత్తం తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేకపోవడం.., తోటి పిల్లలు కావాల్సింది తిని.. కావాల్సింది కొనుక్కుంటుడడంతో బాలుడు డబ్బు కోసం చోరీలు చేయాలని భావించినట్లు తెలిసింది. బాలిక తమ్ముడు స్నేహితుడు కావడంతో ఆ ఇంటికి వెళ్తుండేవారు. ఆ ఇంట్లో డబ్బులు ఎక్కడ పెడతారో అతడు గమనించినట్లు సమాచారం. డబ్బు చోరీ వెళ్లే సమయంలో దొరికిపోతే ఎవరినైనా సరే చంపేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. చోరీ ఎలా చేయాలి.. ఎలా బయటపడాలి ముందే రాసి పెట్టుకున్నాడు. సంబంధిత లేఖ కూడా బయటకు వచ్చింది. దాంట్లో ఈ క్రైం చిత్రానికి మిషన్ డాన్ గా పేరు కూడా పెట్టాడు. ఇంత చిన్న వయసులోనే డబ్బు కోసం అత్యంత కిరాతకంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
………………………………………………………….