![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/download-40.jpg)
* నాలుగు రోజుల్లో పోలీసుల ముందు హాజరుకావాలని వెల్లడి
ఆకేరున్యూస్, హైదరాబాద్: కోడిపందేల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు గురువారం నోటీసులు ఇచ్చారు. కోడి పందాలు జరిగిన ల్యాండ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందినదిగా పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. మొయినాబాద్ తోల్కట్ట గ్రామం సర్వే నెంబర్ 165/ఏలో ఈ ఫార్మ్‌హౌస్ ఉందని పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల్లో ఆధారాలతో తమ ముందు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా మొయినాబాద్ పోలీసులు చేర్చారు. సెక్షన్ 3 అండ్ 4 గేమింగ్ యాక్ట్ కింద్ కేసు నమోదు చేశారు. సెక్షన్ 11 యానిమల్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు. ఫార్మ్ హౌస్‌లో బెట్టింగ్స్ చేస్తూ పందాలు ఆడిస్తున్నట్లు మొయినాబాద్ పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి ఫార్మ్‌హౌస్‌ను సబ్ లీజుకు భూపతి రాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ తీసుకున్నారు. ఫార్మ్‌హౌస్‌లో భారీ సెటప్‌తో కోడి పందాలను గబ్బర్ నిర్వహించాడు. అయితే కోడిపందాలకు సంబంధించి మరి కొంతమందిని విచారించే అవకాశాలు ఉన్నాయి. కాగా.. మూడు రోజుల క్రితం నగర శివారులో భారీ క్యాసినోను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన కలకలం రేపింది. మొయినాబాద్‌లోని ఫామ్ హౌస్‌పై దాడి చేసిన రాజేంద్రనగర్ పోలీసులు.. కోళ్ల పందాలతోపాటు క్యాసినో నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ ఘటనలో 64 మందిని అరెస్టు చేశారు. రూ. 30 లక్షల నగదుతోపాటు 55 కార్లు, 86 కోళ్లు స్వాధీనం పరుచుకున్నారు. పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్ కూడా సీజ్ చేశారు. పట్టుబడినవారిలో ఏపీ, తెలంగాణకు చెందినవారు ఉన్నట్లు సమాచారం. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు కలిసి క్యాసినో, కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
…………………………………………