
* రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆరులైన్ల రహదారి
ఆకేరున్యూస్,హైదరాబాద్ : రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణం మరింత సులువుకానున్నది. హైదరాబాద్ ( HYDERABAD) నుంచి అమరావతి(AMARAVATHI) మధ్య ఆరులైన్ల రహదారికి కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.6,250 కోట్లతో 265 కిలోమీటర్ల మేర రహదారిని అభివృద్ధి చేయనున్నారు. త్వరలో టెండర్లు పిలిచి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న రహదారిని ఆరు లేన్లకు విస్తరించనున్నారు. ఈ రహదారిపై వాహనాలు అదుపులేని వేగంగా ప్రయాణిస్తున్నాయి దీనికి తోడు ఈ రహదారిపై రోడ్డు ప్రమాదాలు తరచుగా సంభవిస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఆరులైన్ల రహదారికి గ్రీన్ సిగ్నల్ తెలిపింది.తెలంగాణలోని దండు మల్కాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గొల్లపూడి వరకు 265 కిలోమీటర్ల పొడవున ఈ రహదారిని విస్తరిస్తారు. రహదారి విస్తరణకు సంబంధించిన డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కేంద్రానికి పంపింది. గతంలో 2010లో ఈ రహదారిని రెండు లేన్ల నుంచి నాలుగు లేన్లకు విస్తరించేటప్పుడు.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎనిమిది లేన్ల కోసం భూసేకరణ చేశారు. ఇప్పుడు ఆ భూమి అందుబాటులో ఉండటం వల్ల ప్రాజెక్టు ఖర్చు, సమయం గణనీయంగా ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు.
……………………………………