* ఉద్యోగులకు సేఫ్టీ పరికరాల పంపిణి
ఆకేరు న్యూస్, హనుమకొండ : అవగాహన లోపం వలన ప్రజలు ఇళ్లలో నాసిరకం వైరింగ్, విద్యుత్ పరికరాలు వాడటం, రైతులు స్విచ్ బోర్డు, మోటార్ స్టార్టర్ ల దగ్గర భద్రత ప్రమాణాలు (ఎర్తింగ్) పాటించకపోవడం వలన విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి(Karnati Varun Reddy) అన్నారు. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(NPDCL) 16 సర్కిళ్ల పరిధిలోని డివిజినల్ ఇంజనీర్లు(టెక్నికల్), అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ల(టెక్నికల్) తో సోమవారం టెలి కాన్ఫెరెన్స్ జరిగింది. ఈ సందర్బంగా కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ ప్రమాదాలు తగ్గించడానికి క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరు విధిగా భద్రత పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాలు జరగడం ఆందోళన కలుగుతుందన్నారు. ప్రమాదాలు నివారించుటకు అన్ని రకాల సంస్థాగత మార్పులతో పాటు సర్కిళ్ల వారీగా డివిజినల్ ఇంజనీర్ (టెక్నికల్ ) లను నోడల్ సేఫ్టీ అధికారులుగా నియమించి సూచించిన చర్యలు పాటించాలని చెప్పారు.
విద్యుత్ ప్రమాదాలు జరగకుండ ప్రజలకు అవగాహన పెంపొందించడానికి ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలు,సినిమా థియేటర్లు, పాఠశాలలు మరియు కళాశాలలు మొదలైన ప్రదేశాల్లో విద్యుత్ భద్రత ఆవగాహన సదస్సులు, సూచనలు, జాగ్రత్తలు తెలియచేసే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. టీజీఎన్పీడీసీఎల్ లో తాజా ప్రమాణాల భద్రతా విధానాలతో ఉద్యోగులకు తగు శిక్షణ కార్యములు నిర్వహిస్తూ, సిబ్బందికి అన్ని రకాల భద్రత పరికరాలు హెల్మెట్, గ్లోవ్స్, పోర్టబుల్ ఎర్తింగ్, షార్ట్ సర్క్యూట్ కిట్లు, సేఫ్టీ షూస్, ఇన్సులేటెడ్ టూల్స్, వోల్టేజ్ డిటెక్టర్ మొదలైనవి అందచేస్తూ, వారికీ నియమిత కాల వ్యవధిలో సమీక్షలు నిర్వహిస్తూన్నామని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి ఫీల్డ్ సిబ్బంది నుంచి సీనియర్ అధికారుల వరకు ఉద్యోగులందరి సమిష్టి కృషి అవసరమని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు, నిరంతర శిక్షణ మరియు భద్రతా పద్ధతులను బలోపేతం చేయడం వలన విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని అన్నారు. టీజీఎన్పీడీసీఎల్ ను జీరో విద్యుత్ ప్రమాదాల సంస్థగా తీర్చిదిద్దెందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామని చెప్పారు.
———————-