
* రాజకీయాల్లో చిరస్థాయిగా ఆయన పేరు
* తండ్రి కోటలో అక్కా, తమ్ముడు చెరోవైపు
* తమ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రత్యర్థులుగా ప్రచారం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
హైదరాబాద్ నగర రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్ర. పేదలు, మధ్య, ధనిక వర్గాలు, అన్ని కులాల్లోనూ ఆయన అభిమానులు ఉన్నారు. మురికివాడల్లో ఆయన పేరు చెబితే చాలు.. ఇప్పటికీ ఓట్లు పడతాయంటే నమ్మి తీరాల్సిందే. మేమే ఆయన వర్గీయులమని చెప్పుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. బస్తీ ఓటర్లకు గాలం వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆయనే పి. జనార్ధన్‌రెడ్డి. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలో దివంగత నేత పీజేఆర్‌ది ఇప్పటికి చెరగని ముద్ర. ఆయన హయాంలో ఏర్పాటు అయిన బస్తీలు అనేకం. ఆయన పేరిట ఏకంగా దేవాలయమే వెలిసింది. ఇప్పుడు రాజకీయ పార్టీల అభ్యర్దులకు కూడా ఆయనే దిశ నిర్ధేశకుడిగా మారారు. ఎన్నిక ఏదైనా చాలా మంది ఆయన పేరుతో ప్రచారం చేయడం పరిపాటిగా మారింది.
పీజేఆర్ వారసులం అంటూ..
పీజేఆర్ వారసులు ఇప్పుడు ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. ఇద్దరు కూడా తాము పనిచేస్తున్న పార్టీలను గెలిపించే బాధ్యత భుజాన వేసుకున్నారు. ఎన్నికల బరిలో దిగి ప్రచారాలు మొదలు పెట్టారు. ప్రత్యర్దులను తట్టుకొని వారసత్వాన్ని నిలుపుకునేందుకు ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్నారు. తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న పీజేఆర్ రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి తండ్రి పార్టీలోనే ఉన్నప్పటికి రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్లో చేరారు. మరో వారసురాలు బీఆర్ఎస్ టికెట్టు పై పోటీ కార్పొరేటర్‌గా విజయం సాధించాక రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఇప్పుడు ఇద్దరు కలిసి నాన్న కోట అయిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నమ్మిన పార్టీ అభ్యర్ధులను గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఇద్దరు కూడా పీజేఆర్ వారసత్వానికి నిలుపుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
అక్కా.. తమ్ముడా.. సై
పీజేఆర్ మరణించిన తరువాత జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో పీజేఆర్ వారసులుగా కాంగ్రెస్ తరఫున పి విష్ణువర్ధన్‌రెడ్డి మూడు దఫాలుగా అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు. ఓ సారి విజయం సాధించారు. రెండు మార్లు ఓటమి చవి చూశారు. 2023 ఎన్నికల్లో పార్టీ ఆయన టికెట్టు కేటాయించకపోవడంతో విష్ణు బీఆర్ఎస్లో చేరారు. కాగా కాంగ్రెస్ అవకాశం లభించకపోవడంతో బీఆర్ఎస్లో చేరిన పి విజయారెడ్డి గ్రేటర్ ఎన్నికల్లో అదే పార్టీ నుంచి రెండు మార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. 2018 నుంచి ఆమె ఖైరతాబాద్ బీఆర్ఎస్ టికెట్టు పై ఆశలు పెట్టుకున్నారు. కాని పార్టీ కేటాయించకపోవడంతో కాంగ్రెస్‌లో చేరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో ఇద్దరు ఎప్పుడు కూడా ఎదురు పడలేదు. కాని ఎమ్మెల్యే మాగంటి మరణంతో ఉప ఎన్నికల అవశ్యత ఏర్పడటం, నానిమేషన్ల ప్రక్రియ మొదలవ్వడంతో ఇప్పుడు అక్కా, తమ్ముడు ప్రత్యర్ధులుగా ఉంటూ ప్రచారం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పీజేఆర్ వర్గం ఎటువైపు?
బీఆర్ఎస్ తరఫున ఎన్నికల బరిలో దిగిన మాగంటి సతీమణి మాగంటి సునీతకు మొదటి నుంచి పీవీఆర్ అండగా నిలబడ్డారు. అంతే కాదు గెలుపు బాధ్యతను భూజాన ఎత్తుకున్నారు. తాను ఎలాగైన మాగంటి కుటుంబాన్ని గెలిపిస్తానని బహిరంగంగా ప్రకటించాడు. పీజేఆర్ అభిమానులను, పార్టీ శ్రేణులను ఒక తాటి మీదకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నవీన్‌యాదవ్‌కు టికెట్టు కేటాయించింది. ఈ నేపథ్యంలో నవీన్‌యాదవ్ మద్దతు కొరుతూ కార్పొరేటర్ పి విజయారెడ్డి కలవడం కాకుండా పీజేఆర్ యూనివర్సల్ నేత అని ప్రకటించాడు. అధిష్ఠానం కూడా నవీన్ గెలుపుకు కృషి చేయాలని విజయారెడ్డికి సూచించడంతో ఆమె వారం రోజులుగా జూబ్లీహిల్స్ పై దృష్టి పెట్టారు. పీజేఆర్ కోసం పనిచేసిన వారిని కలుసుకుంటూ నవీన్‌కు మద్దతు సమకూర్చేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. మరి పీజేఆర్ వర్గం ఎవరికి జై కొడుతుందో అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
……………………………………………….