Palakurthi Congress
* అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు
* బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఫైర్
ఆకేరు న్యూస్, రాయపర్తి : పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అడుగులు అభివృద్ధి దిశగా పడుతుంటే, ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. నిన్న బీఆర్ఎస్ నేతలు చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తూ రాయపర్తి మండల కేంద్రంలో ముఖ్య నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్ దశాబ్ద కాలపు పాలనలో తెలంగాణ అప్పుల కుప్పగా మారిందన్నారు. నేడు ఆ అప్పులకు వడ్డీలు చెల్లించడానికే ప్రభుత్వ ఖజానాలో 50 శాతం నిధులు ఖర్చవుతున్నాయని నాయకులు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో దూరదృష్టితో రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిన పెడుతున్నారని తెలిపారు.
వెంకటేశ్వరపల్లి దేవస్థాన పనుల పరిశీలన త్వరలో ఉండటంతోనే బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. 1000 ఎలుకలు తిన్న పిల్లి కథలా బీఆర్ఎస్ నేతల తీరు మారిందని ఎద్దేవా చేశారు.
నియోజకవర్గంలో భారీ అభివృద్ధి..
రాయపర్తి ప్రజలకిచ్చిన మాట ప్రకారం రూ.14.17 కోట్లతో నిర్మించిన గోడౌన్ పనులు 90 శాతం పూర్తయ్యాయని, పెరికేడులో రూ.2.50 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రం, పలు పల్లె దవాఖానలను ప్రారంభించినట్లు గుర్తుచేశారు. అలాగే జగన్నాధపల్లిలో రూ.2.90 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.
మహిళలపై చిన్నచూపు: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మహిళల పట్ల చిన్నచూపు ఉందనడానికి గత ఘటనలే నిదర్శనమని, ఇప్పుడు ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి కుటుంబంపై అసత్య ప్రచారాలు చేస్తే మహిళా లోకం సహించదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, తొర్రూరు బ్లాక్ అధ్యక్షుడు జాటోత్ హామ్యా నాయక్, వర్ధన్నపేట ఏఎంసి వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డితో పాటు పెండ్లి మహేందర్ రెడ్డి, రెంటాల గోవర్ధన్ రెడ్డి, ఊళ్లేగుల నర్సయ్య తదితరులైన పలువురు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

