* ఉద్రిక్తంగా రెండో విడత సంగ్రామం
* సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇరు వర్గాల మధ్య కొట్లాట
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల సంగ్రామం ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. ప్రధానంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం శివంపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఇరు పార్టీలు గొడవలకు దిగాయి. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోయినాపల్లిలో కూడా ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్, బీఆర్ ఎస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారని వాగ్వాదంతో మొదలై.. ఘర్షణలు మొదలయ్యాయి. వికారాబాద్ జిల్లా గోల్కొండ గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కీర్తి నిరసన వ్యక్తం చేశారు. గోల్కొండ ప్రాంతంలో రోడ్డుపై కూర్చున్న ఆందోళన చేపట్టారు. అధికారులు, పోలీసులు ఒక వర్గానికి సహకరిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో పరిస్థితి నివురుగప్పిన ఉండడం ఆందోళనకరం. తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరగగా, రెండో విడతలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం గమనార్హం. కాగా, మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. సర్పంచ్ ప్రకటన తర్వాత ఉపసర్పంచ్ ఎన్నుకుంటారు.

