* 15 రోజుల పాటు కొనసాగిన సమావేశాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 15 రోజుల పాటు శీతాకాల సమావేశాలు కొనసాగాయి. డిసెంబర్ 1న ప్రారంభమైన శుక్రవారంతో ముగిశాయి. ఈ రోజు లోక్సభలో సభ్యులు జాతీయ గీతం ఆలపించిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. అటు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల తర్వాత రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఇరు సభలు నిరవధిక వాయిదా పడడంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. సమావేశాల్లో లోక్సభ ఉత్పాదకత 111 శాతంగా ఉందని, సభ సజావుగా జరిగేందుకు లోక్సభ సభ్యులందరూ సహకరించారని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు మొదటి నుంచీ వాడీవేడీగా జరిగాయి. ఇండిగో సంక్షోభం, ఎస్ఐఆర్, ఎన్నికల సంస్కరణలు వంటి అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సమయంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఈ సెషన్ లో మొత్తం 59 బిల్లులను ప్రవేశపెట్టారు. ఎనిమిది బిల్లులను పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. అందులో ఎంజీనరేగా స్థానంలో తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ బిల్లు, పౌర అణు రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించే బిల్లులు, బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంచే బీమా సవరణ బిల్లు సహా మరికొన్ని ఉన్నాయి.
…………………………………………….

