
* ఇళ్లు కూల్చడం.. పర్యావరణ హననమే కాంగ్రెస్ నిరంకుశ పాలన
* సుప్రీంకోర్టు తీర్పుతో ప్రపంచానికి తేటతెల్లం
* అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన వ్యవహరిస్తే న్యాయవ్యవస్థ ఊరుకోదు
* మాజీ మంత్రి హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనలో నాడు హైడ్రా పేరుతో ఇళ్ల కూల్చి అరాచకం, నేడు బుల్డోజర్లతో పర్యావరణ హననం తప్ప ప్రజలకు మేలు లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao) అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం చేసిన, చేయబోతున్న పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైందో సుప్రీం కోర్టులో జరిగిన వాదనల వల్ల ప్రపంచానికి తేటతెల్లమైందని తెలిపారు. బాధ్యత గల ప్రభుత్వం, కావాలనే సెలవు దినాల్లో బుల్డోజర్లతో విధ్వంసానికి పాల్పడటంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు అనా్నరు. విధ్వంసం చేసిన వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని నిలదీయడం ఆహ్వానించదగ్గ పరిణామమని తెలిపారు. కంచె గచ్చిబౌలి (Gachibowli) భూములను, పర్యావరణాన్ని కబళించాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ తన రిపోర్టుతో కళ్లు తెరిపించిందని, అధికారం ఉంది కదా అని ఇష్టారీతిగా వ్యవహరిస్తే సభ్య సమాజం, న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ముందుకు వస్తాయని గతంలోనూ అనేక సార్లు నిరూపమైందని, ఈరోజు కూడా అదే జరిగిందని అన్నారు. విధ్వంసమే కాంగ్రెస్ విధానమన్నారు. తమకు న్యాయస్థానాల మీద ఎంతో గౌరవం ఉందని, అందుకే బాధ్యతగా బిఆర్ఎస్ పార్టీ తరుపున సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(Central Empowered Company) కి నివేదిక ఇచ్చామని, ఆధారాలతో సహా వాస్తవాలను వివరించామని తెలిపారు. వృక్షో రక్షతి రక్షిత అని పెద్దలంటే, వృక్షో భక్షతి అన్నట్లుగా తయారైన రేవంత్ (Revanth) కు బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఏకం కావాలని సూచించారు.
………………………………………..