ఆకేరు న్యూస్ డెస్క్ : నారద తుంబురుల పిలుపు అందుకున్నాడేమో,, అమరలోకాలకు అరుదేగాడు అందెశ్రీ..అవధూత తత్వం ఉన్నందు వల్ల నేమో అప్పుడే వెళ్లిపోయాడు.. అక్షరాల అందెల సవ్వడి శాశ్వతంగా మూగబోయింది.. తన గేయాలనే అక్షర మాలలుగా మల్చుకున్న సహజకవి,,అశుకవి ఇకలేరనే వార్త సాహితీ లోకాన్ని శోక సముద్రంలో ముంచింది. పలకా బలపం పట్టి అక్షరాభాస్యం చేయకున్నా.. వాక్కులను అక్షరాలుగా మలుచుకొని సాహితీ ప్రపంచం నివ్వెరబోయేలా పాటలను, రచనలను చేశాడు. జయజయహే తెలంగాణ జననీ జయ కేతనం అంటూ తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రతి రోజు ధ్వనిస్తున్నాడు..
పాటలే ముందుండి ప్రజలను నడిపినవి
పాటలే పెట్టని కోటలై నిలిచినవి
పాటలే కోటి కంఠాలై మ్రోగినవి
పాటలే కదా రాష్ట్ర పట్టాభిషేకాలు
పాట భిక్షే కదా మీరేలే పదవులు
గుండె గుండెన గండ దీపమై వెలిగిన
పాటనవమానించ పదవులహంకారమా
ఏందిరా ఏందిరా తెలంగాణము
ఎలా మూగబోయింది జనగానము
అంటూ ప్రశ్నించిన అందెశ్రీ ఇక లేరనే వార్త తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకుండా ఉంది. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన అందెశ్రీ అందనంత ఎత్తుకు ఎదిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జులై 18 1961న అందెశ్రీ జన్మించారు. అందె శ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య, చిన్నప్పుడే అమ్మానాన్నలు దూరమయ్యారు. ఆకలి తీర్చుకోవడానికి చిన్నప్పుడు పశువుల కాపరిగా, గొర్రెల కాపరిగా పని చేశాడు. తన 14 వ ఏట గృహ నిర్మాణ పనులు చేయడం మొదల పెట్టాడు. ఆ పనిలో నిష్ణాతుడిగా మారి మేస్త్రీ అయ్యాడు. చిన్న తనంలో గ్రామంలో ఉన్న మల్లారెడ్డి మాస్టారు వద్ద పనులు చేస్తూ రామాయణం, ఇతిహాసాలను ఒంటబట్టించుకున్నాడు. అందెశ్రీకి అక్షర జ్ఞానం లేకున్నా అందెశ్రీలో నిగూఢంగా దాగి ఉన్న సాహిత్యాన్ని గుర్తించిన మాస్టారు మల్లా రెడ్డి అందెశ్రీకి మహాభారతం లాంటి ఇతిహాసాల గురించి చెప్పేవాడు. ఆ తరువాత ఆచార్య బిరుదరాజు రామ రాజు ప్రభావంతో ఆయన అందించిన ప్రోత్సాహంతో తనలో దాగి ఉన్నా సాహిత్యానికి మరింత పదును పెట్టాడు.
ఓ వైపు పొట్ట పోసుకోవడానికి పనులు చేస్తూనే అప్పటికప్పడు ఆశు వుగా పాటలు పాడుతూ ఉండే వాడు. అందెశ్రీ పాటల్లో దాగి ఉన్న గొప్పతనాన్ని గుర్తించి అందెశ్రీ మేనమామ సిద్ధయ్య అందెశ్రీ పాటలకు అక్షర రూపం ఇవ్వాలని తలంచాడు. ముందు ఒప్పుకోకున్నా ఆ తరువాత తన మేనమామ ప్రతిపాదనను అందెశ్రీ ఒప్పుకున్నాడు.
అందె శ్రీ ఎలా అయ్యాడు
జీవితం గడవడానికి మేస్త్రీ పనిని వృత్తిగా ఎంచుకున్న ఎల్లయ్య పని ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి పనిచేసే వాడు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో గృహ నిర్మాణ పనికి గుత్తకు తీసుకున్న గుత్తేదారు వెంట నిజామాబాద్ జిల్లాకు వెళ్లాడు. అప్పుడే నిజామాబాద్ జిల్లాల్లో ఉన్న శృంగేరీ మఠానికి స్వామి శంకర మహారాజ్ వచ్చాడు, శంకర్ మహరాజ్ ను చూడడానికి వెళ్లిన అందెశ్రీ శంకర్ మహారాజ్ పై అప్పటికప్పుడు పాటను అల్లి విన్పించాడు. అందెశ్రీ తనపై పాడిన పాటకు అబ్బురపోయిన స్వామిజీ అందెశ్రీలో ఉన్న సాహితీ కోణాన్ని గుర్తించాడు. మహాకవి కాళిదాసు,తెనాలి రామకృష్ట లపై అమ్మవారి అనుగ్రహం ఉండేదని అలాగే అందెశ్రీపై అమ్మ వారి అనుగ్రహం ఉందని దీవించాడు. నీ సాహిత్యంలో అమ్మ వారి అందెల సవ్వడి విన్పిస్తోందని ఇక నుంచి నీ పేరు అందెశ్రీ అంటూ దీవించాడు.. అందెశ్రీ శంకర్ మహారాజ్ దీవెనలతో అందె ఎల్లయ్య కాస్త అందెశ్రీగా మారాడు. అప్పటి నుంచి తెలంగాణ సమాజంలో అందెశ్రీగానే గుర్తింపు పొందాడు.
జయజయహే తెలంగాణ…జననీ జయకేతనం..
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం అంటూ తెలంగాణ ప్రజలు గుండెల నిండా పాడుకునే రాష్ట్ర గీతం అందెశ్రీ చేతి నుండి జాలువారిందే.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందె శ్రీ తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశాడు. 2006 లో కామారెడ్డిలో జరిగిన తెలంగాణ ధూం ధాం కార్యక్రమంలో పాల్గొన్న అందెశ్రీకి తెలంగాణ పై ఓ గేయం ఉండాలన్న ఆలోచన వచ్చింది. అప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతానికి అంకు రార్పణ జరిగింది. 2009 నాటికి పన్నెండు చరణాలతో కూడిన గేయాన్ని రచించాడు ఆ గేయంలో తెలంగాణలో దాగి ఉన్ని గొప్పదనం అంతా ప్రతిబింబిస్తూంది. నేడు అదే తెలంగాణ రాష్ట్ర గీతంగా మారింది.
రాష్ట్ర గీతంగా జయజయహే తెలంగాణ
తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గేయం తెలంగాణ ఏర్పడిన రాష్ట్ర గీతంగా మారుతుందని అనుకున్నారు. కానీ పదేళ్ల తరువాత అందెశ్రీ రచించిన గేయం రాష్ట్ర గేయంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువా త సీఎం రేవంత్ రెడ్డి జయజయహే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గేయంగా ప్రకటించారు,. ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి స్వరకల్పనలో జయజయహే తెలంగాన గేయం రాష్ట్ర గేయంగా మారింది.
కలకాలం గుర్తుండి పోయే పాటలు
అందెశ్రీ కలకాలం గుర్తుండి పోయే పాటలను రచించారు. అందెశ్రీ సినిమా పాటలు కూడా రాశారు.
2006లో గంగ సినిమాకు అందె శ్రీ రాసిన పాటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏడూ అందించే నంది పురస్కారం పొందారు.పల్లెనీకు వందనములమ్మో…..మాయమై పోతున్నడమ్మో మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు….గలగల గజ్జెలబండి…కొమ్మ చెక్కితే బొమ్మరా…జన జాతరలో మన గీతం..యెల్లిపోతున్నావా తల్లిచూడ చక్కని.. మొదలై ప్రజాదరణ కలిగిన పాటలు ఎన్నో రచించాడు.ఎర్ర సముద్రం సినిమా కోసం రచించిన మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల తెలుగు విషయం రెండో సంవత్సరం సిలబస్ లో చేర్చారు.
అందెశ్రీ పొందిన పురస్కారాలు, .
ఎన్నో గౌరవ పురస్కారాలను అందుకున్న అందెశ్రీ
* 2014లో అకాడమిఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ పొందిన అందెశ్రీ
* కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న అందెశ్రీ
* 2006లో గంగ సినిమాకు నంది పురస్కారం పొందిన అందెశ్రీ
* 2015లో దాశరథి సాహితీ పురస్కారం …
* 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం ..
* 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం ..
అర్ధాంతరంగా నిలిచిన పుస్తకం
ప్రకృతిని ప్రేమించి ప్రకృతిలో మమేకమై జీవించిన అందెశ్రీ ప్రకృతి మనుగడకు మూలమైన నదీ జలాలపై ఓ పుస్తకం తీసుకురావాలని కలలు గన్నాడు. ప్రపంచంలో ఉన్న అన్ని నదుల పుట్టుక వాటి మనుగడ ఆ నదుల విశిష్టత గురించి ఈ ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు . ఈ నేపధ్యంలోనే ప్రపంచాన్ని చుట్టు ముట్టు ఆ నుదల ప్రవాహం వెంట పయనిస్తే వాటి గురించి అవగాహన చేసుకున్నాడు. వాక్కులమ్మ ప్రచురణ ద్వారా ప్రపంచానికి అందజేయాలనుకున్నాడు. ఆదిశంకరులు రచించిన సౌందర్యలహరిని తెలుగులో అనువదించి ప్రపంచానికి అందించాడు. అలాగే నదులపై తన అనుభవలాను అక్షర రూపం ఇవ్వాలను కున్నాడు కాని అంతలోనే ప్రకృతి మాత ఒడిలోకి వెళ్లిపోయాడు.
………………………………………………………..
