* సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం పీఎస్కు ప్రభాకర్ రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు సిట్ అధికారుల ఎదుట లొంగిపోయారు. కస్టోడియల్ విచారణకు సుప్రీంకోర్టు పోలీసులకు అనుమతి ఇవ్వడం.. ఈరోజు ఉదయం 11 గంటలకు లొంగిపోవాలని ఆయనకు ఆదేశాలు జారీ చేయడంతో జూబ్లీహిల్స్ పీఎస్ లో ఆయన లొంగిపోయారు. నిన్న సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సిట్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని, మొబైల్, ల్యాప్ టాప్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను మెమరీ మొత్తం డిలీట్ చేసి అప్పగించారని పేర్కొన్నారు. ఆయన నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణకు అప్పగించాలని కోరారు. వారి వాదనలను ఆలకించిన ధర్మాసనం వారం రోజుల కస్టోడియల్ విచారణకు అనుమతినిచ్చింది. అయితే భౌతికంగా ఆయన ఎటువంటి హానీ తలపెట్టవద్దని పేర్కొంది. ఈ మేరకు ఆయన లొంగిపోయారు. విచారణ అనంతరం పోలీసులు ఇచ్చే నివేదిక ఆధారంగా మళ్లీ విచారణ చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.
……………………………………………………..

