* బీఆర్ ఎస్ ప్రత్యర్థులపై దాడులే తిరుపతన్న డ్యూటీ
* ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించిన అడిషనల్ ఎస్పీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. కేసీఆర్ సర్కారు హయాంలో పోలీసు వ్యవస్థలోని ఓ గ్రూపు చేసిన అన్యాయాలు ఆశ్చర్యకరంగా మారాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అడ్డదారులను తొక్కిన వైనం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అదనపు ఎస్పీ తిరుపతన్న వాంగ్మూలాన్ని సైతం పోలీసులు తాజాగా బహిర్గతం చేయడంతో అందులోని అంశాలు తీవ్రచర్చనీయాంశంగా మారాయి. అతి తక్కువ వ్యవధిలోనే సీఐ నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయికి ఎదిగిన తిరుపతన్న.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్రధారి. ప్రభాకర్‌రావు, భుజంగరావు ఆదేశాలతో బీఆర్ ఎస్ ప్రత్యర్థులపై ఎన్నికల సమయంలో మెరుపు దాడులు నిర్వహించినట్లు తిరుపతన్న తన వాంగ్మూలంలో తెలిపారు.
*నిత్యం 40-50 మంది సెల్ఫోన్లను ట్యాప్
నాటి అధికార పార్టీ ప్రత్యర్థులపై నిఘా పెట్టడమే డ్యూటీగా తిరుపతన్న వ్యవహరించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు, భుజంగరావు ఆదేశాలతో, బీఆర్ఎస్ ప్రత్యర్థులపై మెరుపు దాడులు నిర్వహించి డబ్బులు పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ విధమైన చర్యలు కోసం ఇద్దరు సీఐలు, 20 మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నామని, రోజుకు 40 నుంచి 50 మంది సెల్ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు చెప్పారు. 3 ఉపఎన్నికలతో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లో తాను పనిచేసినట్లు తిరుపతన్న ఇచ్చిన వాంగ్మూలంలో పోలీసులు నమోదు చేశారు.
*ప్రత్యేక వాట్సప్ గ్రూపు
బీఆర్ ఎస్ ప్రత్యర్థులపై దాడులు, నిఘా సమాచారం షేర్ చేసుకునేందుకు ‘పీఓఎల్- 2023’ పేరుతో ప్రత్యేక ఎలక్షన్ వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసినట్లు వివరంచారు. కొన్ని సందర్భాల్లో ఎస్ఓటీ, టాస్క్ఫోర్స్లతో కలిసి పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారంతో విపక్షాల సానుభూతిపరుల నుంచి డబ్బులను సీజ్ చేసినట్లు చెప్పారు.
* ప్రత్యర్థుల డబ్బే సీజ్
ఎన్నికల సమయంలో కొల్లూరులో రేవంత్ రెడ్డి మిత్రుడు గాలి అనిల్‌కుమార్ నుంచి రూ.90 లక్షలు, మరో మిత్రుడు కె.వినయ్‌రెడ్డి నుంచి రూ.1.95 కోట్లు సీజ్ చేసినట్లు తిరుపతన్న తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ ఇన్ఫ్రా నుంచి రూ.10.5 కోట్లు, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మిత్రుడు వేణు దగ్గర రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వినోద్‌కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి రూ.50 లక్షలు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిత్రుడు గిరిధర్ నుంచి రూ.35 లక్షలు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీరెడ్డి నుంచి రూ.90 లక్షలు, ఖమ్మంలో మంత్రి పొంగులేటి మరో మిత్రుడు, ఫెర్టిలైజర్ సంస్థ యజమాని వద్ద రూ.10 లక్షలు సీజ్ చేసినట్లు వెల్లడించారు.
—————————