
* జనసేన ఆవిర్భావ వేడుకతో పండుగ కళ
* ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసిన జనసైనికులు
ఆకేరు న్యూస్, పిఠాపురం : గత అసెంబ్లీ ఎన్నికల్లో సృష్టించిన ప్రభంజనంతో ఆంధ్రప్రదేశ్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది జనసేన పార్టీ. ఆవిర్భావ దినోత్సవం (Janasena Formation Day Celebrations )వేళ మరోసారి ట్రెండింగ్ లో నిలుస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. దేశ రాజకీయాలను సైతం శాసించేలా మారడంతో ఆయన స్థాయికి తగ్గట్టుగా వేడుక చేసేందుకు జనసేన శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. నిజానికి అధికారం లేనప్పుడు కూడా అధికార పార్టీ నేతలపై నిప్పులు చెరిగే విధానం, ఎండగట్టే విధానం ఆయనను ఇంత స్థాయికి తీసుకొచ్చింది అంటారు ఆయన అభిమానులు. అలాంటి తరుణంలోనే ఎన్నో కార్యక్రమాలు చేసాము. ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత మొట్టమొదటి కార్యక్రమం చేస్తున్నాము, రాష్ట్రం కాదు దేశం ప్రపంచం కూడా చూసే విధంగా ఆ కార్యక్రమం జరుగుతుంది అంటున్నారు జనసైనికులు. జనసేన పార్టీ(Janasena Party)ని స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా, ఆయనకు ఘనవిజయం అందించిన పిఠాపురంలో చేయబోతున్నారు. ఈరోజు ఆ కార్యక్రమం లక్షలాది మంది అభిమానుల మధ్యలో జరగనుంది. దీంతో గత వారం రోజులుగా ఇదే ప్రాంతంలో మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar)తో పాటు కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్, ఇతర ఎమ్మెల్యేలు ఇదే ప్రాంతంలో త్రిష్టవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వేడుక జరిగే పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామం.. ప్రస్తుతం గూగుల్ లో ట్రెండింగ్ లో మారింది. అక్కడకు ఎలా వెళ్లాలి.. రూట్ మ్యాప్ ఏంటి అనే చాలా మంది చూసుకుంటున్నారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ వేడుకకు వచ్చే వారి కోసం సభా ప్రాంగణం, చుట్టూ భారీ ఏర్పాట్లు చేశారు. 5 చోట్ల పార్కింగ్ సౌకర్యం, మంచినీరు, మజ్జిగ స్టాళ్లు, ఫుడ్ స్టాళ్లు, వేసవి నేపథ్యంలో పండ్లు అందుబాటులో ఉంచారు. దాదాపు 14 అంబులెన్సులు, 7 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన సిబ్బంది అంతా ఎప్పటి నుండో పార్టీకి స్వచ్చందంగా సేవ చేస్తున్న వారే. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం కూడా ముందుకొచ్చి అంబులెన్సులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించింది.
………………………………….