
* చంద్రబాబు, పవన్ రూపంలో ఏపీకి శక్తివంతమైన రూపం
* దేశాభివృద్ధికి ఏపీ అభివృద్ధి అవసరం
* కాంగ్రెస్ హయంలో కరెంటు కోతలు ఉండేవి
* కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏపీని మోసం చేశాయి
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి :
ఢిల్లీ, అమరావతి కలిసి పని చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi ) అన్నారు. ఏపీ ( Andhra Pradesh ) లోని కర్నూలు లో నిర్వహించిన సూపర్ జీఎస్టీ ( GST ) .. సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. సభా వేదిక పైనుంచి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొత్తం 13వేల 400కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ( Chandra babu ) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ( Pawan Kalyan ) నారా లోకేష్,( Nara Lokesh ) కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. డబుల్ ఇంజిన్ సర్కారు సారథ్యంలో ఏపీ ప్రగతి పథంలో నడుస్తోందని చెప్పారు. ఏపీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో విజనరీ పాలన నడుస్తోందన్నారు. ఆత్మగౌరవం, సంస్కృతికి ఏపీ నిలయం అన్నారు.
ఏపీకి శక్తివంతమైన నాయకత్వం
చంద్రబాబు, పవన్ రూపంలో.. ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ యువశక్తి ఉందన్నారు. కేంద్రం నుంచి కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్నామని వెల్లడించారు. 16 నెలల్లో అభివృద్ధి డబుల్ ఇంజిన్‌లా దూసుకుపోతోందన్నారు. రోడ్లు, రైల్వేలతో సహా అనేక ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపనలు చేసుకుంటున్నామని, ఈ 21వ శతాబ్దం భారత్ దేనని మోదీ స్పష్టం చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. ఆ లక్ష్య సాధనకు స్వర్ణాంధ్ర ఎంతో సహకరిస్తోందని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు ఉండేవని, పలు గ్రామాల్లో కనీసం కరెంటు స్తంభాలు కూడా ఉండేవి కావని అన్నారు. ఇప్పుడు దేశంలో కరెంటు లేని గ్రామం లేదన్నారు. శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు గ్యాస్ పైపులైను వేసుకుంటున్నామన్నారు. విశాఖపట్టణం ఏఐ హబ్ గా మారబోతుందని ప్రకటించారు. ఇటీవలే ఏపీ గూగుల్ తో భారీ ఒప్పందం చేసుకోవడం శుభపరిణామమన్నారు. దేశాభివృద్ధికి ఏపీ అభివృద్ధి అవసరం అని, ఏపీ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ది అవసరమని మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ విజన్‌కు ఏపీ ఒక కీలక కేంద్రంగా మారబోతుందని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏపీని మోసం చేశాయని, కూటమి ప్రభుత్వంలో ఏపీ దేశానికి సరికొత్త శక్తిగా అవతరించబోతుందన్నారు. భారతదేశ డ్రోన్ హబ్‌గా కర్నూలును ఏపీ ప్రభుత్వం ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఓర్వకల్లు నుంచి కొప్పర్తి మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు.
—————–