
* ఆపరేషన్ సింధూర్‌తో మన శక్తిని చాటిన మోదీ
* కర్నూలు సభలో సీఎం చంద్రబాబునాయుడు
* కర్మను పాటించే నాయకుడు: పవన్ కల్యాణ్
ఆకేరు న్యూస్, కర్నూలు : మన భవిష్యత్ ను కాపాడే నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. 25 ఏళ్లుగా దేశానికి అద్భుతంగా సేవలు అందిస్తున్నారని వివరించారు. కర్నూలు నిర్వహించిన సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. సరైన సమయంలో సరైన నాయకుడు మోదీ అన్నారు. మోదీ తెచ్చిన జీఎస్టీ సంస్కరణల ద్వారా ప్రతీ కుటుంబానికి ఏటా 10 వేల రూపాయలకు పైగా మేలు జరుగుతోందని వెల్లడించారు. మనశక్తి ఏంటో ఆపరేషన్ సింధూర్‌తో మోదీ చూపించారని కొనియాడారు. మోదీ రాక ముందు ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో ఉన్నామని, ప్రస్తుతానికి నాలుగో స్థానానికి చేరుకున్నామని, 2038నాటికి రెండో ఆర్థిక శక్తిగా ఎదుగుతామని స్పష్టం చేశారు. మాటలు కాదు, చేతల్లో చూపించే నేత ఆయన అని, రాబోయే శతాబ్దాలకు మోదీ పునాది వేశారని అన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. తాను ఎంతో మంది నేతలను చూశానని, ఇప్పటివరకు మోదీ లాంటి నేతను చూడలేదని చంద్రబాబు వెల్లడించారు.
ప్రధాని మోదీని కర్మయోగిగా చూస్తాం : పవన్ కల్యాణ్
ప్రధాని మోదీని కర్మయోగిగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీర్తించారు. ధర్మాన్ని పాటిస్తూ కర్మను పాటించే నాయకుడు మోదీ అన్నారు. కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తట్టుకుని నిలబడి ఉంటామని, మోదీ నాయకత్వంలో సమిష్టిగా ముందుకు వెళ్తామని పవన్ స్పష్టం చేశారు. ఎలాంటి ఫలితాలను ఆశించకుండా సేవ చేస్తున్నారని.. ధర్మాన్ని పాటిస్తూ కర్మను పాటించే నాయకుడని.. భారత్ ను అగ్రగ్రామిగా నిలుపుతున్నారని పేర్కొన్నారు.
——————————–