
* అసలు ఆ లేఖ నిజమేనా?
* ఇప్పటి వరకు స్పందించని కవిత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
“Daddy,
Congratulations on the Success of the meeting.
కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి.. మీతో Share చేస్తున్నాను..” అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత.. ఆయన తండ్రికి రాసినట్లుగా వెలుగులోకి వచ్చిన ఓ లేఖ తెలంగాణ రాజకీయాల్ల కలకలం సృష్టిస్తోంది. ప్రముఖ మీడియా మాధ్యమాల్లో పతాక శీర్షికలకు ఎక్కింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ లేఖ పూర్తి పాఠం పక్కన పెడితే.. వరంగల్ సభ నిర్వహణపై అసంతృప్తి, బీజేపీపై మరింత బలంగా మాట్లాడాల్సిన అవసరం, బీజేపీతో భవిష్యత్ పొత్తు ప్రచారాలపై ఆందోళన వంటి అంశాలు అందులో ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చామనే సందేశాన్ని కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లిందని, పార్టీకి స్పష్టమైన వ్యూహాలు, ప్లీనరీ సమావేశాలు అవసరమని కవిత సూచించినట్లు లేఖలో పేర్కొన్నారు. అధికారికంగా ఈ లేఖపై కవిత ఇంకా స్పందించలేదు. అయితే అందులోని దస్తూరి.. గతంలో ఆమె రాసిన లేఖలతో సరిపోతోందని అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లేఖ సంగతి ఎలా ఉన్నా, ఇప్పుడు అది హాట్ టాపిక్ గా మారింది.
కవిత లేఖపై కోమటిరెడ్డి ఏమన్నారంటే..
కేటీఆర్, హరీష్రావు కలిసి కవిత పేరుతో లేఖ రాశారని, ఆ లేఖకు, కవితకు సంబంధమే లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. లెటర్ ఆలోచన ఎలా వచ్చిందో, ఎక్కడ ప్లాన్ వేశారో తనకంతా తెలుసునని, ఆర్టిఫీషియల్ (Artificial) లేఖను కూడా సరిగా రాయలేకపోయారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ (BJP)తో కలుస్తుందని, 20 లేదా 30 సీట్లలోనే బీఆర్ఎస్ పోటీ చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబంలో కలహాలు అనేది పెద్ద డ్రామా అని, వందేళ్ళయినా కేసీఆర్ కుటుంబం కలిసే ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. కవిత గురించి ఆలోచించే సమయం తనకు లేదన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ ఉంటుందని అన్నారు.
అది కాంగ్రెస్, బీఆర్ ఎస్ సృష్టే
కవిత లేఖపై బీజేపీ ఎంపీ డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమని, ఈ కుట్రలో భాగమే కవిత లేఖ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ఒక ముఖ్య నాయకుడు, ఈ లేఖ వెనక ఉన్నారని ఆమె ఆరోపించారు. తండ్రికి కూతురు లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ను కలిసే పరిస్థితి కూడా కవితకు లేదా అని అన్నారు. అసలీ లేఖ కవిత రాసిందేనా.. రాస్తే ఎలా బయటకు వచ్చింది.. ఎవరు రిలీజ్ చేసారని డీకే అరుణ ప్రశ్నించారు.
………………………………………………