* వర్షాల కారణంగా కూలిన ఇల్లు
* శిథిలాల కింద చిక్కుకున్న మహిళను రక్షించిన పోలీసులు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : వర్షాల కారణంగా ఇల్లు కూలి పోవడంతో ఇంటి శిథిలాల కింద చిక్కుకున్న మహిళను పోలీసులు రక్షించిన ఘటన నారాయణపేట జిల్లా కేంద్రంలోని హజికన్పేట లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..నారాయణపేట జిల్లా కేంద్రంలోని హజికన్పేటకు చెందిన చింతామణి అనే మహిళ ఇల్లు తీవ్ర వర్షాల కారణంగా రాత్రి సుమారు 11 గంటల సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో చింతామణి శిధిలాల కింద చిక్కుకొని, కేవలం తల మాత్రమే బయటకు కనిపించింది. విషయం తెలుసుకున్న స్థానిక యువకులు వెంటనే నారాయణపేట టౌన్ పోలీసులకు సమాచారం అందించారు టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో ఎంతో కష్టపడి సుమారు అరగంటపాటు శ్రమించి చింతామణిని సురక్షితంగా బయటకు తీశారు . తరువాత ఆమెను పోలీసు వాహనంలో నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం లేకుండా చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… వర్షాల సమయంలో పాత మరియు బలహీనమైన ఇళ్లలో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి ప్రమాదం గమనించినా వెంటనే నారాయణపేట పోలీసులకు లేదా డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని సూచించారు.
………………………………………………
