* ముషీరాబాద్‌లో భారీగా కుళ్ళిన చికెన్ స్వాధీనం
హైదరాబాద్ (ఆకేరు న్యూస్): ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న ముఠా గుట్టును వారాసిగూడ పోలీసులు రట్టు చేశారు. ముషీరాబాద్‌లోని బాపూజీ నగర్లో గల ‘ఎ-1 ఫ్రెష్ చికెన్ మార్ట్’ పై దాడి చేసి, సుమారు 610 కిలోల కలుషితమైన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
*అసలేం జరిగింది?
విశ్వసనీయ సమాచారం మేరకు, సికింద్రాబాద్ జోన్ డీసీపీ శ్రీమతి కె. రక్షిత కృష్ణమూర్తి, ఆదేశాలతో, చిల్కల్గూడ ఏసీపీ శ్రీ కె. శశాంక్ రెడ్డి పర్యవేక్షణలో వారాసిగూడ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో బాపూజీ నగర్‌లోని సదరు చికెన్ సెంటర్‌పై పోలీసులు నిఘా పెట్టారు.
*షాకింగ్ దృశ్యాలు:
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సబ్-ఇన్స్పెక్టర్ కె. రామచంద్రారెడ్డి తన సిబ్బందితో కలిసి మారువేషంలో షాపును సందర్శించారు. అక్కడ పరిస్థితి అత్యంత అపరిశుభ్రంగా ఉండటంతో వెంటనే సోదాలు నిర్వహించారు. ఫ్రీజర్‌లో దాదాపు 610 కిలోల చికెన్ నిల్వ ఉంది.ఆ మాంసం పూర్తిగా కుళ్ళిపోయి, భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. ఎలుకలు, పిల్లులు తిరుగుతున్న చోటే ఈ మాంసాన్ని భద్రపరచడం గమనార్హం.
*లైసెన్స్ లేదు:
సదరు షాపు వ్యాపార లైసెన్స్ గడువు ఏడాది క్రితమే ముగిసినప్పటికీ, నిందితుడు యథేచ్ఛగా వ్యాపారం సాగిస్తున్నట్లు గుర్తించారు.
*నిందితుడి వివరాలు:
పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడిని ముషీరాబాద్‌కు చెందిన షేక్ షకీల్ (40), తండ్రి జమీన్ మియాగా గుర్తించారు. నిందితుడు తక్కువ ధరకే కుళ్ళిన మాంసాన్ని కొనుగోలు చేసి, దానిని స్థానిక ప్రజలకు మరియు చిన్న హోటల్ వ్యాపారులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది.
*పోలీసుల హెచ్చరిక:
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఇటువంటి అక్రమ వ్యాపారాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వారాసిగూడ ఇన్స్పెక్టర్ శ్రీ జి. రాజేందర్ గౌడ్ హెచ్చరించారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
