
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరాన్ని వేధిస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సైబరాబాద్ పోలీసులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయే గుర్తిస్తున్నారు. అందుకు గల కారణాలపై అధ్యయనం చేస్తున్నారు. ఐటీ సంస్థలు, విద్యా సంస్థలు ఇలా పలు సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. ఈక్రమంలోనే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ జాయింట్ సీపీ విద్యా సంస్థల నిర్వాహకులతో సమన్వయ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి పలు విద్యా సంస్థల నిర్వాహకులు హాజరయ్యారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులు ఎక్కువగా స్కూలు బస్సులను వినియోగించేలా యజమానులు ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. ప్రైవేట్ కార్ల వినియోగం తగ్గించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. రద్దీ ఎక్కువగా వుండే సమయాల్లో స్కూల్ పక్కన, యూ టర్క్ తీసుకునే ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో పాఠశాలలకు చెందిన స్కూలు బస్సులు ప్రణాళిక ప్రకారం రాకపోకలు సాగించాలని, ఒకే మార్గంలో ఎక్కువ స్కూల్ వాహనాల రద్దీ పెరగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గిస్తే, స్కూల్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య కొంతమేర తగ్గే అవకాశం ఉంది. స్కూల్ యాజమాన్యాలు కార్ పూలింగ్పైనా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం ద్వారా వాహనాల రద్దీని తగ్గించవచ్చన్నారు.
భద్రత దృష్టి
విద్యార్థుల భద్రతపై కూడా దృష్టి సారించాలని స్కూలు యాజమాన్యాలకు పోలీసులు సూచించారు. పాఠశాలల బస్సులు నడిపే నిరంతరం ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించాలని, తద్వారా విద్యార్థులకు సురక్షితమైన ప్రయాణం కల్పించవచ్చని పేర్కొంటున్నారు. స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధిత స్కూలు యాజమాన్యాలు స్పష్టమైన ప్రయాణ మార్గాలు, మార్గదర్శకాలు సూచించాలి. పాఠశాల యాజమాన్యం, విద్యార్ధుల తల్లిదండ్రులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి సమర్థవంతమైన, సురక్షిత ట్రాఫిక్ నిర్వహణలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.
……………………………………………….