* ఆధునిక టెక్నాలజీ ఉన్నా చిక్కని వైనం
* సంచలన కేసుల్లో నేటికీ దొరకని దొంగలు
* బాధితులకు జరగని న్యాయం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
మహానగరంలో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. దేశంలో ఉన్న మొత్తం సీసీటీవీ కెమెరాల్లో 60 శాతం కెమెరాలు హైదరాబాద్ మహా నగరంలోనే ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. కెమెరాలు అన్నింటినీ లోకల్ పోలీస్‌స్టేషన్ నుంచి ఏసీపీ, డీసీపీ కార్యాలయాలతో పాటు అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. 24/7 మానిటరింగ్ చేయడానికి అక్కడ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉన్నారు. ఇంత నెట్వర్క్ ఉన్నా కరడుగట్టిన దోపిడీ దొంగలు, అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలో తిష్టవేసి వరుస దోపిడీలకు తెగబడుతూ పోలీసులు సవాల్ విసురుతున్నాయి. కీలక కేసుల్లో దొంగలు నేటికీ చిక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.
నేపాలీ దొంగలెక్కడ..
కాచిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో జరిగిన చోరీ కేసులో భారీ మొత్తంలో బంగారం, నగదును దోచుకుపోయిన నేపాలీ దొంగల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఏప్రిల్ లో పారిశ్రామికవేత్త హేమరాజు, అతని భార్యకు మత్తుమందు కలిపిన డ్రింక్స్ ఇచ్చి బంగారం, నగదు దోచుకుపోయిన విషయం విదితమే. హేమరాజు ఇంట్లో పనికి కుదిరిన నేపాల్‌కు చెందిన అర్పిత, మరో ముగ్గురు లోకేంద్ర బహదూర్ షాహీ, దీపేందర్ ఆలియాస్ గజేందర్, చతుర్బుజ్ ఆలియాస్ ఆర్యన్లు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. వీరిని పట్టుకోవడానికి తూర్పు మండలం డీసీపీ బాలస్వామి, అదనపు డీసీపీ జోగుల నర్సయ్య ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నేపాల్, లక్నో, గోరఖ్‌పూర్, ముంబై, బెంగళూర్లలో జల్లెడపట్టినా ఫలితం లేకపోయింది.
దొరకని కాల్పుల దొంగలు
నగరం నడిబొడ్డున కాల్పులు జరిపి ఒక వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన బిహార్ దోపిడీ దొంగల ఆచూకీ నెలలు గడుస్తున్నా ఇంకా దొరకలేదు. వాళ్లు సుమారు గంటన్నరకు పైగా నగరంలోనే ఉన్నట్లు ఆధారాలు లభించినా వారిని పట్టుకోవడంలో పోలీసులు విఫలం అయ్యారు. బీదర్‌లో కాల్పులు జరిపి ఓ వ్యక్తిని చంపి, ఏటీఎంలో రూ. 90 లక్షలు దోపిడీ చేసి హైదరాబాద్‌కు పారిపోయి వచ్చిన దొంగలు సిటీలోనూ కాల్పులు జరిపారు. బీదర్ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమై నగరం నలుమూలల నుంచి పోలీస్ సిబ్బందిని, అటు రైల్వేపోలీసులను, నాలుగు మూలల జిల్లాల పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఉంటే కచ్చితంగా దొంగలు దొరికేవారనే విమర్శలు వచ్చాయి.
చుడీదార్ దొంగలూ అంతే..
చుడీదార్, ముఖానికి ముసుగు ధరించి మహిళల వేషధారణలో అపార్ట్మెంట్లోకి ప్రవేశించి చోరీలకు పాల్పడిన దొంగల జాడ ఇప్పటి వరకు తెలియలేదు. గతేడాది జూన్‌లో ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం పగులగొట్టి ప్లాట్‌లోకి ప్రవేశించిన దొంగలు అల్మారాలో దాచిన 4 తులాల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు, ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన తీరును బట్టి ప్రొఫెషనల్ దొంగలు పక్కా పథకం ప్రకారం చోరీ చేసినట్లు పోలీసులు అనుమానించారు. దోపిడీ జరిగి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఆ దొంగల జాడను పోలీసులు కనిపెట్టలేకపోయారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీలు ఉన్నా వారిని గుర్తించి పట్టుకోవడం ఇప్పటికీ పోలీసులకు సాధ్యపడకపోవడం గమనార్హం.
………………………………………………………………
