* పోలింగ్ శాతం నమోదుపై ఉత్కంఠ
* ఎన్నిక, ఎన్నికకు తగ్గుతున్న పోలింగ్ శాతం
* 2014లో 70.75.. 2019లో 62.25 శాతం
* హైదరాబాద్ నుంచి భారీగా సొంతూర్లకు ఓటర్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 5.30 నుంచి 7 గంటల వరకు అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. ఓటు వేసేందుకు ఓటర్లు తరలివెళ్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ శాతం పెంచేందుకు కొద్ది రోజులుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గతం కంటే ఆశాజనకంగానే పోలింగ్ శాతం ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఎన్నిక, ఎన్నికకు తగ్గుతున్న పోలింగ్ శాతం ఆందోళన కలిగిస్తోంది. గత లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈసారి ఎలా ఉంటుందనే ఉత్కంఠ ఏర్పడింది.
బరిలో 525 మంది అభ్యర్థులు
రాష్ట్రంలో ఈరోజు 17 లోక్సభ స్థానాలకు, ఒక అసెంబ్లీ (కంటోన్మెంట్) స్థానానికి ఎన్నికలు జరుగుతన్నాయి. 17 ఎంపీ స్థానాల్లో మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో మహిళా అభ్యర్థులు 50 మంది ఉండడం గమనార్హం. అత్యధికంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 45 మంది పోటీలో ఉన్నారు. అతి తక్కువగా అదిలాబాద్ నియోజకవర్గం బరిలో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు మూడు కోట్ల 32 లక్షల మంది ఉన్నారు. వీరిలో ఎంత మంది ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే.. 2014 నాటి ఎన్నికలతో పోలిస్తే.. 2019 ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా తగ్గింది. 2019తో పోల్చితే.. ఈ సంవత్సరం తగ్గుతుందా, పెరుగుతుందా అనేది ఉత్కంఠగా మారింది. పోలింగ్ శాతం కొన్నిచోట్ల అభ్యర్థుల భవితవ్యాన్ని మార్చేస్తుంది.
2014కు, 2019కు 8.50 శాతం తగ్గిన ఓటింగ్
2014 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో పోలింగ్ శాతం 70.75గా నమోదైంది. గత ఎన్నికల్లో అది 62.25 శాతంగా ఉంది. అంటే 8.50 శాతం ఈసారి ఓటింగ్ తగ్గింది. ఈ లెక్కన లక్షలాది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను అత్యధికంగా ఖమ్మంలో 75.61 శాతం పోలింగ్ నమోదవగా.. అత్యల్పంగా హైదరాబాద్ లో 39.49 మేర ఓట్లు పోలయ్యాయి. మల్కాజిగిరి సెగ్మెంట్ లో 42.75.. సికింద్రాబాద్ సెగ్మెంట్ లో 45 శాతం ఓటింగ్ నమోదైంది. 17 లోక్సభ స్థానాలకు గాను హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి భాగ్యనగరం పరిధిలో ఉన్నాయి. మిగతా 14 స్థానాల్లో 50 శాతానికి మించి పోలింగ్ నమోదైతే.. నగరంలోని ఈ మూడు నియోజకవర్గంలో 50 శాతం లోపు మాత్రమే ఓట్లు పోల్ కావడం గమనార్హం. ఈనేపథ్యంలో ఈసారి కూడా హైదరాబాద్ టాక్ ఆఫ్ ద ఓటింగ్ గా మారింది. పట్టణ ఓటర్లకు ఎప్పుడూ బద్దకం అని ప్రతిసారీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో ఓటర్లలో చైతన్యం పెరుగుతుందా, లేదా అనే ఆసక్తి ఏర్పడింది. అయితే.. సొంతూర్లలో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి భారీగా బయలుదేరారు. వారిలో కొంత మంది నగరంలో కూడా ఓటరుగా నమోదై ఉన్నారు. వీరంతా ఊరిలోనే ఓటు వేస్తే.. అది నగర పోలింగ్ శాతంపై పడే అవకాశం ఉంది.
—————