
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
దుమ్ము, ధూళి, పొగ.. మహా నగరవాసుల ఆరోగ్యాన్ని కబళిస్తున్నాయి. నగరంలో పెరుగుతున్న కాలుష్యం ఎంతో మంది ఆయువును తీస్తోంది. అందుకే కాలుష్య గణాంకాలు పెరుగుతుంటే హైదరాబాద్ వాసి ఆందోళనకు గురవుతాడు. అయితే ఈ కాలుష్యం మనుషులనే కాదని, రాజధానికి తలమానికంగా నిలిచిన మెట్రోరైలును కూడా కబళిస్తోందని తాజాగా ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు.. అకస్మాత్తుగా ఆగిపోతున్న రైళ్ల ఘటనలకు దుమ్ము, ధూళే కారణమని పేర్కొంటున్నారు.
ట్రాక్‌పై ఎందుకు ఆగిపోతున్నాయంటే..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు మెట్రోరైలు కీలకంగా మారింది. నిత్యం లక్షలాది మంది ఈ రైళ్లగుండానే ప్రయాణాలు సాగిస్తున్నారు. మొత్తం మూడు కారిడార్లలో రైలు నడుస్తోంది. 57 స్టేషన్లలో నిత్యం 57 రైళ్లు 1100 ట్రిప్పులు తిరుగుతుంటాయి. ఉదయం 6 గంటలకు మొదలవుతున్న రైళ్లు రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా నడుస్తుండడంతో నగరవాసులు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే మెట్రోరైళ్లను సాంకేతిక సమస్యలతో తరచూ ఆగిపోతున్నాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకు కారణం కాలుష్యం అని తెలుస్తోంది.
పొల్యూషన్.. పరేషన్
నగరంలో లక్షలాది మంది పనుల నిమిత్తం కార్లు, వాహనాలు తీసుకుని రోడ్లపైకి వస్తున్నారు. ఇదే సమయంలో క్యాబ్‌లు, ఆటోలు కూడా వేలాదిగా తిరుగుతుండడంతో దుమ్ము, ధూళి విపరీతంగా పెరుగుతోంది. 2017 నవంబర్ 28 నుంచి 2024 నవంబర్ 28 వరకు మెట్రో రైళ్ల ద్వారా నగరంలో 184 మిలియన్ లీటర్ల ఇంధనాన్ని ఆదా చేశామని, 424 మిలియన్ కిలోగ్రాముల కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడ్డామని అధికారులు చెప్పినప్పటికీ.. ఎలివేటెడ్ ట్రాక్షన్‌పై దుమ్ము, ధూళి పేరుకుపోయి రైళ్లను సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.
ఎలివేటెడ్ ట్రాక్షన్‌పై దుమ్ము, ధూళి
కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ (సీబీటీసీ) ద్వారా నడుస్తున్న రైళ్లు పట్టాలపై ఉన్న ఫలంగా ఆగిపోతుండడానికి కారణం కాలుష్యమేనని అధికారులు చెబుతున్నారు. దుమ్ము, ధూళి కారణంగా రైలులోని సున్నిత పరికరాలు తరచూ దెబ్బతింటున్నాయని, ఉప్పల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ)లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అధికారులు ఇదే సమస్యను తమకు తరచూ చెబుతున్నారని ఓ మెట్రో ఉన్నతాధికారి చెప్పారు. దీంతో రూ. కోట్లు విలువ చేసే పరికరాలు కొన్నేళ్లలో పాడైపోయే ప్రమాదముందని ఆయన పేర్కొన్నారు. 2025 జనవరి 29న అమీర్‌పేట్-హైటెక్‌సిటీ మార్గంలో ఏర్పడిన సాంకేతిక సమస్యతో రెండు గంటలకు పైగా రైళ్లు ఆగిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎలివేటెడ్ ట్రాక్షన్‌పై దుమ్ము, ధూళి పేరుకుపోవడంతో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని ఇంజనీర్లు చెబుతున్నారు.
…………………………