ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా పొట్లపల్లి శ్రీధర్ రావు ఐదవ సారి బాధ్యతలు చేపట్టనున్నారు. మండలంలోని పల్లగుట్ట గ్రామానికి చెందిన శ్రీధర్ రావు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నప్పటికీ స్వ గ్రామం పల్లగుట్ట మండల అభివృద్ధితో పాటు శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పై దృష్టి సారించారు. మొదటిసారిగా జూలై 19, 2021న చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. మార్చి 3, 2022 రెండవసారి, 21 ఫిబ్రవరి 2023న మూడోసారి, 16 నవంబర్ 2024న నాలుగవసారి, 9 మార్చి 2026 న ఐదవ సారి చైర్మన్ గా నియమితులయ్యారు.
” 13న పదవీ ప్రమాణ స్వీకారం
శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా పొట్లపల్లి శ్రీధర్ రావు ఐదవ సారి పాలక మండలితో ఈనెల 13న పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గోలి రాజశేఖర్, పుల్యాల నారాయణ రెడ్డి, వేముల వెంకటేశ్వర్లు, గణగోని రమేష్, కందూరి రంగరాజు, దారం రాజన్ బాబు, గొల్లపల్లి వాసు, బుల్లె కుమార స్వామి, బత్తుల సూర్యనారాయణ, ఎడ్ల యాదయ్య, భూక్య శ్రీనివాస్, గూడెల్లి అరుణ, ఎనగందుల రత్నాకర్ రెడ్డి, ఎక్స్ అఫిషియో సభ్యుడిగా బ్రాహ్మణపల్లి రవీంద్ర శర్మ లను నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
” అభివృద్ధిపై దృష్టి…
చైర్మన్ గా పొట్లపల్లి శ్రీధర్ రావు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించారు. యమునా ఆలయానికి ఈశాన్యం వైపున ఉన్న బండను తొలగించి ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు చేయించారు. 2015 నుండి అర్ధాంతరంగా ఆగిపోయిన కళ్యాణమండపం, కాలక్షేపమంటపాలకు రూ.10 లక్షల విరాళం ఇచ్చి పూర్తి చేయించారు. దీంతోపాటు స్వామివారు పాదము మోపిన గుట్ట పైకి 580 మెట్ల నిర్మాణం పూర్తి చేయించారు. ప్రతి ఏటా నిర్వహించే స్వామి వారి బ్రహ్మోత్సవాలకు గతంలో లేని విధంగా ఏర్పాట్లు చేయించి మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తారు. అంతే కాకుండా ఆలయానికి పంచ రంగులతో కలరింగ్, విద్యుత్ దీపాల ఏర్పాటు, పార్కింగ్, దైవదర్శనానికి వచ్చే భక్తులకు త్రాగునీరు అందించడం మొదలైన అభివృద్ధి కార్యక్రమాలపై చైర్మన్ పొట్లపల్లి ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ఆ క్రమంలోనే మరోమారు చైర్మన్ గా నియమించడంతో శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్థానిక కడియం శ్రీహరిల సహకారంతో మరింత అభివృద్ధి చెందుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు.
