* మీడియా ద్వారా ప్రజలకు క్షమాపణలు
ఆకేరు న్యూస్ , డెస్క్ : చిల్డ్రన్స్ డే,, వాలంటైన్స్ డే..ఉన్నట్లుగా సారీ..(క్షమాపణల దినం) డే ఉంటుందేమో అన్పిస్తోంది. ఏ పని చేసినా ఆచి తూచి చేయాలి.. ఏది మాట్లాడినా ఆచి తూచి మాట్లాడాలి..
చేసిన పనిని తిరిగి చేయలేం.. నోటి నుండి వెలువడిన మాటలను తిరిగి వెనక్కి తీసుకోలేం..పొరపాటున అన్న మాటలు.. చేసిన పనులు జీవితాంతం వెంటాడతాయి.. ముఖ్యంగా సమాజంలో గుర్తింపు ఉన్న వాళ్లు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఈ విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి..
నాకు ఆ ఉద్దేశ్యం లేదు : కొండా సురేఖ
మంత్రి కొండా సురేఖ విషయమే తీసుకుందాం.. ఆమె గతంలో అక్కినేని నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి.. ఈ విషయంలో పార్టీ అధిష్టానమే అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. కొండా సురేఖ తాను అన్న మాటలను మొదట్లో సమర్థించుకున్నారు. అక్కినేని నాగేశ్వర్ రావు కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో ఎంత గుర్తింపు ఉన్న కుటుంబమో కొండా సురేఖకు తెలియంది కాదు.. కొండా సురేఖ చేసింది రాజకీయ విమర్శలు కాదు.. అక్కినేని కుటుంబంపై మీడియా సాక్షిగా వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న నాగార్జున ఏకంగా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. రేపు అనగా నవంబర్ 13 న నాగార్జున వేసిన పిటిషన్ నాంపల్లి కోర్టులో విచారణకు రానుంది. కోర్టు తీర్పు ఎలా వస్తుందనే విషయాన్ని పక్కన పెడితే మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పారు. మంత్రి స్థాయిలో అలా మాట్లాడి ఉండ కూడదు అనుకున్నారో.. తన తప్పును తెలుసుకున్నారో ఏమో మొత్తానికి అక్కినేని కుటుంబానికి ఆమె సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు..
అలా చేసి ఉండకూడదు : ప్రకాశ్ రాజ్
ఇక బుధవారం జరిగిన మరో సంఘటన ఏమిటంటే ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మీడియా సమక్షంలో తాను చేసింది తప్పేనని ప్రజలకు క్షమాపణ చెప్పాడు.. తెలియక చేసినా అలా చేసి ఉండకూడదు అని ఒప్పుకున్నారు. బెట్టంగ్ యాప్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ప్రకాశ్ రాజ్ బుధవారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన ప్రకాష్‌రాజ్ మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్ స్కాం విచారణ కోసం ఈడీ పిలవడంతో వచ్చానని తెలిపారు. ఒక యాప్ గురించి యాడ్ చేశానని, అప్పుడు అది బెట్టింగ్ యాప్ అని తెలియదని అన్నారు. తెలిసిన తర్వాత యాడ్ నుంచి తప్పుకున్నా అన్నారు. 2016-17లో బెట్టింగ్ యాప్స్ పై బ్యాన్ ఉందని, అంతకు ముందే ఓ యాప్ గేమ్ అనుకుని యాడ్ చేశానని అన్నారు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే.. క్షమించాలని కోరినట్లు తెలిపారు. ఇటువంటి యాప్‌ల పట్ల యంగస్టర్స్ అప్రమత్తంగా ఉండాలని, వీటి వల్ల నష్టపోతామని సూచించారు. కష్టపడి పైకి రావాలన్నారు. మరో అగ్ర హీరో విజయ్ దేవరకొండ కూడా బెట్టింగ్ యాప్‌లో నిన్న సీఐడీ అధికారుల ముందు హాజరైన విషయం తెల్సిందే..
తప్పు చేశాను : ప్రవీణ్ ప్రకాశ్
రిటైర్ట్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆయన క్షమాపణలు చెప్పారు. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. సర్వీసులో ఉండగా వారిపట్ల తాను అనుచితంగా ప్రవర్తించానని, అందుకు చింతిస్తున్నానని వీడియోలో పేర్కొన్నారు. 30 ఏళ్ల సర్వీసులో నిజాయితీ గా సేవలందించానన్నారు. తాను చేసిన సేవలు తనను ప్రజల్లో హీరోగా చేశాయన్నారు. కానీ ఒకే ఒక తప్పు చేశాను సారీ అని చెప్పుకొచ్చారు.2020లో ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో.. ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆఫీస్ నుంచి ఫైల్ వచ్చింది. నాకంటే ఏబీ వెంకటేశ్వరరావు ఐదేళ్ల సీనియర్ ఆఫీసర్.. డీజీపీ ఆఫీస్ ఫైల్ ప్రకారమే .. ఏబీవీపై చర్యలు తీసుకోవచ్చని చెప్పానని అన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో తాను చేసిన తప్పు అర్థమైందని చెప్పారు. . ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ విషయంలోనూ తప్పు జరిగిందంటూ ఏబీ వెంకటేశ్వరరావు, కృష్ణకిషోర్‌కు క్షమాపణలు చెప్పారు.
…………………………………………………….
