
* నోటికి.. వీపునకు కూడా..!!
* బ్రిటీష్ నటి నోటికి రూ. 16.5 కోట్ల బీమాతో మరిన్ని వెలుగులోకి
* శరీర భాగాల బీమాకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్న సెలబ్రిటీలు
* హాట్ టాపిక్ గా కొందరు
* సింధియా ప్రకటనతో తెరపైకి మరికొంత మంది
* శరీరంలోని ఒక్కో భాగానికి ఒక్కో ఇన్సూరెన్స్
* అదీ రూ.పదుల కోట్ల నుంచి వందల కోట్లలో..
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి
ఆమెకు నవ్వడం.. నవ్వించడం అంటే ఇష్టం. తన నవ్వు, గొంతు వల్లే వృత్తిలో ఇంతలా రాణించానని ఆమె భావిస్తారు. ‘వాష్ యువర్ మౌత్’ కార్యక్రమానికి ప్రచారకర్తగా కూడా ఉన్నారు. ఇదంతా ఓకే కానీ.. తాజాగా ఆమె చేసిన పని సంచలనంగా మారింది. ఇంతకీ ఆమె ఏం చేశారో తెలుసా..? తన నోటికి రూ. 16.5 కోట్ల విలువైన బీమా చేయించుకున్నారు. బ్రిటీష్ నటి సింథియా ఎరివోకు చెందిన ఈ ఇన్సూరెన్స్ కథ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సింథియా నటన, పాటలతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్, టోనీవంటి ప్రతిష్ఠాత్మక అవార్డులకు నామినేషన్లను పొందారు. ఆస్కార్ తప్ప మిగతా వాటిని ఆమె చేజిక్కించుకున్నారు. ఇంత ఘనత సాధించినా తాజాగా బీమా వల్ల మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు. తన రెండు దంతాల మధ్య ఉన్న గ్యాప్‌ను, తన విలక్షణ నవ్వు, గళాన్ని కాపాడుకునేందుకు బీమాను తీసుకున్నానని ఆమె పేర్కొనడం వైరల్ అయింది. ఈక్రమంలో శరీర భాగాల బీమాకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్న మరింత మంది సెలబ్రిటీల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
దేశానికి చెందిన సెలబ్రిటీలూ..
సెలబ్రిటీ ఎవరికైనా అందం, అభినయం ముఖ్యం. అందుకే వారు వాటికి అమిత ప్రాధాన్యం ఇస్తుంటారు. ఒకరికి మధురమైన స్వరం ఉంటే.., మరొకరికి కలువల్లాంటి కళ్లు, ఇంకొకరికి ఆకట్టుకునే ముఖం, పలువురికి అందమైన చిరునవ్వు.. ఇలా ప్రత్యేకంగా ఉంటారు. వారికి ఆకర్షణగా ఉన్న ఆయా అవయవాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుండడమే కాదు, ఇన్సూరెన్స్ లు కూడా చేయిస్తున్నారు. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్సులు చాలా మందికి ఉంటాయి కానీ, ప్రత్యేకంగా కొన్ని అవయవాలకే ఉండడం బ్రిటీష్ నటి సింధియా ప్రకటనతో తెరపైకి వచ్చింది. అయితే ఆమే కాదు.. శరీర భాగాలకు చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే ఇన్సూరెన్సులు తీసుకున్నారు. ఆ కోవలో దేశానికి చెందిన అమితాబ్ బచ్చన్ తన వాయిస్‌కు, సానియా మీర్జా తన చేతులకు బీమా చేయించుకున్నట్లు తెలుస్తోంది.
రూ.200 కోట్ల నుంచి రూ.500 కోట్లు కూడా..
బ్రిటీష్ నటి సింధియా తన నోటికి రూ. 16.5 కోట్ల బీమా చేయించానని పేర్కొన్న నేపథ్యంలో సెలబ్రిటీల శరీర భాగాలకు ఇన్సూరెన్స్ పై ఆసక్తి ఏర్పడింది. ఈ అంశంపై సెర్చ్ చేస్తుండగా మరింత మందికి చెందిన ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. అయితే జెన్నిఫర్ లోపెజ్ తన వీపు భాగాన్ని రూ.200కోట్లకు బీమా చేయించారని గతంలో వార్తలు వచ్చాయి కానీ దానికి ఆమె ధ్రువీకరించినట్లుగా ఎక్కడా కనిపించలేదు. అమెరికన్ సింగర్ మారియా కరే తన కాళ్లు, స్వరపేటికల కోసం రూ.500 కోట్లకు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, డేవిడ్ బెక్‌హామ్ తమ కాళ్లకు బీమా తీసుకున్నారు. బ్రిటిష్ సెలబ్రిటీ చెఫ్ గోర్డన్ రామ్సే తన నాలుకు ఇన్సూరెన్స్ తీసుకున్నారు.
అమెరికన్ కమెడియన్ ఆశ్చర్యకర నిర్ణయం
అందరి కంటే వినూత్నంగా అమెరికన్ కమెడియన్, రియాలిటీ షో స్టార్ నిక్ క్యానన్.. తన ప్రైవేటు పార్ట్స్‌కు ఏకంగా 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 83 కోట్లు) బీమా చేయించుకుని వార్తల్లో నిలిచారు. ఈ విషయంపై ఆయన పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ.. “కొందరు సెలబ్రిటీలు తమ కాళ్లకు, గొంతుకు, వీపునకు ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి కదా.. నేను నా అత్యంత విలువైన “ఆస్తులకు” బీమా చేయించుకోవలసి వచ్చింది. అందుకే నేను.. నేను నా శరీరంలో అత్యంత విలువైన భాగానికి బీమా చేయించుకోవాలని అని అనుకున్నాను” అని పేర్కొనడం గమనార్హం.
శరీర భాగాలకు ఇన్సూరెన్స్ ఎందుకు అంటే..
కొందరు సెలబ్రిటీలు ప్రత్యేకంగా కొన్ని భాగాలకు ఇన్సూరెన్స్ లు చేయించుకోవడం వెనుక అనేక కారణాలు ప్రచారంలో ఉన్నాయి. తమ వృత్తిలో రాణించడానికి కారణమైన శరీర భాగాలకు ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాదం వల్ల నష్టం జరిగితే కెరీర్ దెబ్బతినే అవకాశం ఉంది. గుర్తింపునూ కోల్పోయే ప్రమాదం ఉంది. అలా జరిగితే వారి బ్రాండ్, ఆదాయానికి గండి కొడుతుంది. పాపులారిటీని కూడా కోల్పోతారు. అందుకే, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. స్టార్లు వారి శరీర భాగాలకు బీమా చేయించుకుంటారు. అయితే బీమా పాలసీలు సెలబ్రిటీల మార్కెటింగ్‌కు కూడా బాగా ఉపయోగపడతాయి. అమెరికన్ కమెడియన్, రియాలిటీ షో స్టార్ నిక్ క్యానన్ ఇన్సూరెన్స్ వెనుక కూడా అలాంటి కథే వినిపిస్తోంది. మరింత ఫేమస్ అవ్వాలనే కారణంతోనే ప్రైవేటు పార్ట్స్ కు ఇన్సూరెన్స్ చేయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ‘వాష్ యువర్ మౌత్’ కార్యక్రమానికి ప్రచారకర్తగా సింథియా కేవలం నోటికే ఇన్సూరెన్స్ చేయించుకోవడం వెనుక కూడా అదే కారణం అన్న చర్చ జరుగుతోంది.
………………………………………………