
* గాలి జనార్ధన్ రెడ్డి పిటిషన్
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కుంభకోణం కేసులో చంచల్గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న గాలి జనార్దనరెడ్డి, తనకు జైలులో అదనపు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ కోర్టు గాలి జనార్దనరెడ్డిని దోషిగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని చంచల్గూడ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. జైలులో ఇప్పటికే అందుతున్న వసతులకు తోడు, మరిన్ని వ్యక్తిగత, ఆరోగ్య సంబంధిత అదనపు సదుపాయాలు కావాలని గాలి జనార్దనరెడ్డి అభ్యర్థించారు. ఇందుకోసం తన న్యాయవాదుల ద్వారా నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్ కోర్టు రిజిస్ట్రీ వద్ద పరిశీలనలో ఉంది. త్వరలో విచారణకు స్వీకరించాలా అనే విషయంలో న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ స్కాం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో గాలి జనార్దనరెడ్డి, ఆయన సహచరులు అక్రమంగా ఖనిజ సంపదను తవ్వి వేల కోట్ల రూపాయల మేర అక్రమ ఆదాయాన్ని సంపాదించినట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది. విచారణ అనంతరం కోర్టు ఆయనకు శిక్ష విధించింది.
……………………………………………