
* బీసీలంతా కవితకు మద్దతివ్వాలని పిలుపు
* ఆర్ కృష్ణయ్యను ఆయన నివాసంలో కలిసిన కవిత
ఆకేరు న్యూస్, హనుమకొండ ః ఎమ్మెల్సీ కవిత చేస్తున్న బీసీ ఉద్యమానికి బీసీలంతా మద్దతివ్వాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. తాను చేపట్టిన బీసీ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత ఆర్ కృష్ణయ్యను కలిశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ సంయుక్తంగా జూలై 17న తలపెట్టిన రైల్ రోకో కార్యక్రమంతో సహా ప్రతీ కార్యక్రమానికి తాము అండగా నిలిచి పాల్గొంటామన్నారు, బీసీలంతా ఎమ్మెల్సీ కవిత ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
బీసీ ఉద్యమంలో కృష్ణయ్యసేవలు మరువలేనివి
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ… బీసీల సంక్షేమం కోసం కృష్ణయ్య చేస్తున్న పోరాటం మరువలేనిదని అన్నారు. అనేక ప్రజాస్వామిక, సామాజిక ఉద్యమాలను కృష్ణయ్య నడిపించారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు కోసం రెండు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన దానికి ఫలితంగా రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించిందని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 243(డీ) ప్రకారం ఒక జీవో ఇచ్చి 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ఆస్కారం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ పని చేయకుండా నెపాన్ని మొత్తం రాష్ట్రపతిపై తోసేసి రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికల్లోకి వెళ్లే ప్రణాళిక రచించడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల ప్రేమను మాటల్లో వరకే పరిమితం చేస్తూ చేతల్లో చూపించడం లేదని విమర్శించారు. కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని లీకులు ఇస్తున్న నేపథ్యంలో ప్రజా వ్యతిరేక విధానాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే మార్గంగా కనిపిస్తోందని, కాబట్టి రైల్ రోకో చేపడుతున్నామని వివరించారు ఓర్ ఏక్ ధక్కా… బీసీ బిల్లు పక్కా… అని కవిత స్పష్టం చేశారు.
…………………………………………..