
* వాతావరణ శాఖ వెల్లడి
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వర్షాలు మాత్రం వదలడం లేదు. భారత వాతావరణ శాఖ అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయి.ఉపరితల ఆవర్తనం మహారాష్ట్ర నుంచి తెలంగాణ, కర్ణాటకల మీదుగా సముద్రమట్టానికి 3.1కిలోమీటర్ల ఎత్తులో ఉండటంతో రాబోయే కోన్ని గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణాను వదలని వర్షాలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో 21 cm కు పైగా వర్షపాతం నమోదయ్యే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారడంతో కూడా దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన పడింది. ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
అతి భారీ, భారీ వర్షాలు కురిసే జిల్లాలు ఇవే
ముఖ్యంగా సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక హన్మకొండ, జనగామ, నిర్మల్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నేడు, రేపు హైదరాబాద్ లో వర్షాలు
ఇదిలా ఉంటే హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తుంది. నిన్న రాత్రి నుండి వివిధ ప్రాంతాలలో కురిసిన వర్షంతో నగర జీవనం అస్తవ్యస్తంగా మారింది. నగరంలో రోడ్ల జలమయమై అనేక చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇక నేడు, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ముఖ్యంగా వర్షాలు కురిసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
వాయుగుండం తీరం దాటేది అక్కడే
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రస్తుతం వాయువ్య, మధ్య బంగాళాఖాతం సమీపంలో పూరి తీరానికి దక్షిణ ఆగ్నేయంగా అరవై కిలోమీటర్ల దూరంలో గోపాల్ పూర్ కు దగ్గర కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం క్రమంగా వాయువ్య దిశగా పయనించి, పూరి, కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
…………………………………………..