
– సొంతపార్టీపైనే ఇటీవల తరచూ విమర్శలు
– టీ.బీజేపీ నేతలే లక్ష్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు
– గతంలో ఏడాది పాటు పార్టీ నుంచి సస్పెన్షన్
– మరోసారి హాట్‌టాపిక్‌గా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : క్రమశిక్షణ గల పార్టీగా భారతీయ జనతా పార్టీకి పేరు. ఢిల్లీ లీడర్ల నుంచి గల్లీ నేతల వరకూ ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని పదే పదే ఒక్కానిస్తారు. వాస్తవం కూడా కొంత లేకపోలేదు. ఇతర పార్టీల్లా బీజేపీలో అంతగా కలహాలు బయటపడవు. ఒకరకంగా తెలంగాణలో బలపడడానికి అదీ ఓ కారణంగా ప్రచారంలో ఉంది. అయితే క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకునే ఆ పార్టీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కొరకరాని కొయ్యగా మారాడు. పార్టీని ఇరుకున పెట్టే విధంగా తరచూ మాట్లాడుతున్నాడు. ఇదే తరహాలో వ్యవహరించి గతంలో ఏడాదికిపైగా సస్పెండ్ అయ్యాడు. అసెంబ్లీ ఎన్నికల ముందు తిరిగి పార్టీలో చేరాడు. తాజాగా మరోసారి సొంత పార్టీ నేతలపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.
మజ్లిస్‌నే కాదు.. బీజేపీని కూడా..
రాజాసింగ్ మొదటి నుంచీ దూకుడు స్వభావం గల వ్యక్తే. అయితే ఎక్కువగా మజ్లిస్ నేతలే టార్గెట్‌గా ఆయన వ్యాఖ్యలు ఉండేవి. కానీ, ఇటీవల సొంత పార్టీ నాయకులనూ వదలడం లేదు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలే వివాదాస్పదం అయ్యాయి. పలు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు రావడంతో పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన తీరు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని భావించిన క్రమశిక్షణ సంఘం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దాదాపు ఏడాది తర్వాత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సస్పెన్షన్ ఎత్తేసి తొలి జాబితాలోనే టికెట్ కేటాయించింది. ఆయన భారీ మెజార్టీతో మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
మళ్లీ వివాదాస్పదం
కొంత కాలం పాటు స్తబ్దుగానే ఉన్న రాజాసింగ్ ఇటీవల మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. వరుసగా రెండు, మూడు రోజులుగా మాటల దాడి మరింత పెంచారు. ముఖ్యమంత్రితో కొందరు నాయకులు రహస్యభేటీ అవుతున్నారని ఇటీవల రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇబ్బంది పెట్టేలా మారాయి. అలాగే రాష్ట్ర బీజేపీకి త్వరలో వచ్చే కొత్త అధ్యక్షుడు రాష్ట్రం నుంచా? కేంద్రం నుంచా అనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందంటూ ఆయన మాట్లాడటం మరోసారి చర్చకు దారితీసింది. కొత్త అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే ఆయన రబ్బర్‌స్టాం్‌పగా మిగిలిపోతారని, సెంట్రల్ కమిటీ నిర్ణయిస్తే తెలంగాణలో మంచి భవిష్యత్ ఉంటుందనే వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో చర్చకు దారితీశాయి. పార్టీ పెద్దలకు చెప్పినా పట్టించుకోకపోవడం వల్లనే ప్రజల్లో పెడుతున్నా అని పేర్కొనడం సంచలనంగా మారింది.
చర్యలు తప్పవా?
అలాగే బీజేపీలోనే తనకు వెన్నుపోటు దారులు ఉన్నారని మరోసారి మాట్లాడారు. గత సర్కారు తనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిందని, ఆ సమయంలో కొంతమంది బీజేపీ నేతలు కూడా పోలీసులకు మద్దతుగా నిలిచారని ఆరోపించారు. ‘నీపై పీడీయాక్ట్ పెడుతున్నాం. మీ బీజేపీ వాళ్లు కూడా ప్రోత్సహిస్తున్నారు’ అని ఒక పోలీసు అధికారి తనతో చెప్పారని రాజాసింగ్ వెల్లడించారు. పార్టీలోని కొందరి నాయకులపై రాజాసింగ్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోషల్‌మీడియాలో వైరల్ అవుతుండడంతో కార్యకర్తలు, నాయకుల్లో గందరగోళం నెలకొంటోంది. పార్టీలో అగ్రవర్గాలకే పదవులు వస్తున్నాయని, బీసీలను పట్టించుకోవడం లేదని, పాత సామానును ఇంటి నుంచి బయటకు పంపించాలంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. ఆయన చేసే ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి మింగుడుపడడం లేదు. ఈక్రమంలో మరోసారి ఆయనపై పార్టీపరంగా చర్యలు ఉంటాయా అనే చర్చ జరుగుతోంది.
…………………………………………..