
* మున్ముందు ఏం జరగబోతోంది..
* రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ లో తీవ్రస్థాయిలో చర్చలు
* వెనక్కి తగ్గని ఎమ్మెల్యే
* కార్యకర్తలతో దేనికైనా సిద్ధమంటున్న రాజగోపాల్ రెడ్డి
* కాంగ్రెస్ లోనే ఉంటారు.. కారణమిదే అంటున్న మరికొందరు
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాను రేవంత్ రెడ్డిని కానీ, పార్టీని కానీ విమర్శించడం లేదంటూనే కాకరేపే కామెంట్లు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కని నాటి నుంచీ ఏదో విధంగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వడం లేదని ఏం చేయాలో మీరే చెప్పాలని అక్కడి ప్రజానీకాన్ని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు, భవనాల నిర్మాణాల కోసం ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మంత్రిని వందసార్లు కలిసినా ఫలితం లేకపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించక తప్పదని అన్నారు. అంతేకాదు.. పదవులూ ఇవ్వకుండా.. నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రశ్నించాలా వద్దా అన్నారు. ఈక్రమంలో పార్టీ అధిష్ఠానం ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది.
చెక్ పెడదామా? ఆగుదామా?
రాజగోపాల్ రెడ్డి వ్యవహారం రోజురోజుకూ ముదురుతుండడంతో దీనికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఈక్రమంలోనే నిన్న టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్.. అటు క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవితోను, సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. వారి మధ్య రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై తీవ్ర చర్చ జరిగినట్లు తెలిసింది. అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డితో భేటీ అయి.. సర్ది చెప్పే ప్రయత్నం చేస్తామని అన్నారు. ఒకవేళ మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు.. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో వేచిచూసే ధోరణలో కూడా అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఇలాంటి సమయంలోనే చెక్ పెట్టాలని, లేకుంటే మరికొందరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు ఉంటాయని సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వివాదం రేపింది ఎవరు?
నియోజక వర్గ అభివృద్ధి ప్రస్తావన తెస్తున్నా.. రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి ప్రధాన కారణం మంత్రి పదవి ఇవ్వకపోవడమే. ఆయన 2023 ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరినప్పుడు తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారనీ, అయితే రాష్ట్ర నాయకులు దీనిని అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చినప్పటికీ, అధిష్ఠానం దానిని అమలు చేయలేదని ఆయన అంటున్నారు. భట్టి కూడా ఆ మాట వాస్తవమే అని ఒప్పుకుంటున్నారు. అయితే అప్పుడు భట్టి ఢిల్లీ పెద్దలతో మాట్లాడే హామీ ఇచ్చారా.. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జితో మాట్లాడి హామీ ఇచ్చారా అనేది స్పష్టత లేదు. ఏదేమైనా ఆయనకు పార్టీలోని కీలక వ్యక్తుల నుంచి మంత్రి పదవి హామీ రావడమ నిజమేనని, మాట ఇచ్చి తప్పడం వల్లే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. వివాదం మొదలుకావడానికి పార్టీనే కారణమని వారు ఆరోపిస్తున్నారు.
ఏం చేద్దాం..?
రాజగోపాల్ రెడ్డి విమర్శలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. అగ్రస్థాయిలోనే నేతలు చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సీరియస్‌గా స్పందించింది. కమిటీ చైర్మన్ మల్లు రవి, రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి విమర్శలపై పరోక్షంగా తిప్పికొడుతున్నారు. పది మందిలో ఒకే ఒక్కడికి చైర్ దక్కుతుందని, మిగిలిన వారు నిరాశ చెందుతారని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. పార్టీ తీరు ఇలా ఉండగా.. రాజగోపాల్ రెడ్డి కూడా మరో నిర్ణయంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ.. తనపై చర్యలు ఉపక్రమించినా.., తన డిమాండ్లను ఒప్పుకోకపోయినా కీలక నిర్ణయంగా తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారుం. ఇప్పటికే ఆయన కమలం పెద్దలతో టచ్ లో ఉన్నట్లు రాజగోపాల్ రెడ్డి శిబిరంలో చర్చ జరుగుతోంది. మునుగోడుకు కమలం గుర్తును పరిచయం చేసింది ఆయనే. అయితే.. ఆ గుర్తుపై పోటీ చేసి గతంలో ఓడిపోయారు. ఈక్రమంలో మళ్లీ బీజేపీలో చేరే అవకాశం ఉండదని మరికొందరు పేర్కొంటున్నారు. అన్న మంత్రి కాబట్టి పార్టీని వీడరని, పదవి.. నిధులు.. లేదా ఇతర అంశాల్లో లబ్ది కోసం పట్టుబడుతున్నారని విశ్లేషిస్తున్నారు.
…………………………………………….