Rashmika Mandanna
* జయమ్మ పాత్ర స్ఫూర్తితో ‘అన్నపూర్ణ’ ప్రాజెక్ట్
* విజయ్ దేవరకొండ ప్రశంసలు
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్: హీరోయిన్ రష్మిక మందన్న తన మంచి మనసును చాటుకున్నారు. తన కొత్త సినిమా ‘రణబాలి’లోని జయమ్మ పాత్ర స్ఫూర్తితో అన్నపూర్ణ పేరుతో సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎనిమిది ప్రాంతాలకు చెందిన 400 కుటుంబాలకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందించారు. అంతేకాకుండా ఈ సేవా కార్యక్రమాన్ని ఏడాది పాటు కొనసాగించనున్నట్లు వెల్లడించారు. రష్మిక చేపట్టిన ఈ మంచి పనిపై నటుడు విజయ్ దేవరకొండ సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు.
400 కుటుంబాలకు అండగా..
తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు రష్మిక తెలిపారు. ఇప్పటివరకు తాను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి బయటకు చెప్పలేదని, తనకు, తన బృందానికి మాత్రమే ఈ విషయం తెలుసునని పేర్కొన్నారు. అయితే తన సేవా కార్యక్రమం మరికొందరికి స్ఫూర్తినిస్తుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం 400 కుటుంబాలకు అండగా నిలుస్తున్నానని, ప్రతి మూడు నెలలకు ఒకసారి వారికి నిత్యావసర సరుకులు అందిస్తూ ఏడాది పొడవునా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఈ సహాయం వల్ల కుటుంబాలకు కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని, నిత్యావసరాల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బును భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకోగలరని ఆశిస్తున్నట్లు తెలిపారు.
రష్మికపై విజయ్ ప్రశంసలు
రష్మిక చేపట్టిన ‘అన్నపూర్ణ’ ప్రాజెక్టుపై విజయ్ దేవరకొండ ప్రశంసలు కురిపించారు. ఆమె గతంలోనూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారని, అయితే వాటిని ఎప్పుడూ ప్రచారంలోకి తీసుకురాలేదని అన్నారు. ఇప్పుడు ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ఏడాది పాటు 400 కుటుంబాలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
వాతావరణ మార్పులు, కరువు వంటి పరిస్థితులు ప్రజల జీవనంపై ప్రభావం చూపుతున్న సమయంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని విజయ్ అభిప్రాయపడ్డారు. రష్మిక మంచి మనసును చూసి గర్వపడుతున్నానని, మనం ఎదగడంతో పాటు మన చుట్టూ ఉన్నవారికి కూడా అండగా నిలవాలని సందేశమిచ్చారు.
అక్టోబర్ 16న ‘రణబాలి’ విడుదల
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో రష్మిక పోషించిన జయమ్మ పాత్ర స్ఫూర్తితో ఆమె ప్రారంభించిన సేవా కార్యక్రమం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అభిమానులు, నెటిజన్లు రష్మిక మంచి మనసును ప్రశంసిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

