* సంగారెడ్డి జేఎన్టీయూ క్యాంటిన్ లో కలకలం
* విద్యార్థుల ఆందోళన
* విచారణకు ఆదేశించిన మంత్రి దామోదర రాజనర్సింహ
ఆకేరు న్యూస్, సంగారెడ్డి : టిఫిన్ లో వినియోగించే చట్నీలో సాధారణంగా ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వంటి తాళింపు గింజలుంటాయి. కరివేపాకు కూడా ఉంటుంది. కానీ సంగారెడ్డి జేఎన్టీయూ (Sangareddy JNTU) కళాశాల క్యాంటీన్లోని చట్నీలో ఏకంగా ఓ ఎలుక దర్శనం ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు ఆందోళన చెందారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగుతోంది. మూత సరిగా పెట్టకపోవడంతో చట్నీ గిన్నెలో పడిన ఎలుక బయటికెళ్లుందుకు అటు ఇటు పరిగెత్తిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇటీవల ఆహారంలో పురుగులు, ఎలుకలు, బల్లులు దర్శనమిస్తున్న ఘటనలు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే.
స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి జేఎన్ టీయూ క్యాంటిన్ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యంపై విద్యార్థులు ధ్వజమెత్తుతున్నారు. కిచెన్ పరిశుభ్రంగా ఉంచకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ స్పందించారు. అయితే ఎలుక తినేందుకు ఉంచిన గిన్నెలో కాకుండా.. శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో పడిందని ఆయన స్పష్టం చేశారు. పాత్రలో ఉన్న ఎలుకను వీడియో తీసి వైరల్ చేశారని ప్రిన్సిపల్ నరసింహ తెలిపారు. దీనిపై మంత్రి దామోదర రాజనర్శింహ స్పందించారు. విచారణకు ఆదేశించారు. కళాశాలల క్యాంటిన్లలో తనికీలు చేపట్టాలని, అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని అన్నారు.
—————————————————————————