* హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచన
* గోపాల్ రెడ్డి పిటిషన్ కొట్టివేత
ఆకేరు న్యూస్, డెస్క్ : సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కింది. బీసీ రిజర్వేషన్లపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారని పిటిషనర్ ను ప్రశ్నించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది. రిజర్వేషన్లపై గోపాల్ రెడ్డి వేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది. బీసీ రిజర్వేషన్లను 42శాతం ఇవ్వడంతో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో గోపాల్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. హైకోర్టులో పిటిషన్ ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించగా, ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఇబ్బంది అవుతుందని, అత్యవసర పరిస్థితిగా తీసుకోవాలని న్యాయస్తానాన్ని విన్నవించారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ఇది పంచాయతీ రాజ్ చట్టంలో సెక్షన్ 2,285కు విరుద్ధం అంటూ పిటిషనర్ వాదించారు. ప్రాథమిక హక్కులకు జీవో 9 భంగం కలిగిస్తుందన్న పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా హైకోర్టు నిరాకరించింది. ఇప్పుడు సుప్రీం కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఈనెల 8న హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి అక్కడే తేల్చుకోవాలని సూచించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ తదితరులు ఢిల్లీలోనే ఉండి న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు.. తాజా తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. అయితే హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వనుందో వేచి చూడాలి.
…………………………………………….
