* హనుమకొండలో గ్యాస్ కష్టాలు
* హంటర్ రోడ్ హెచ్పీ ఏజెన్సీ వద్ద వినియోగదారుల ఆందోళన!
ఆకేరు న్యూస్, వరంగల్: హనుమకొండ: నగరంలోని హంటర్ రోడ్లో గల గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా హంటర్ రోడ్లోని హెచ్పీ (HP) గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈ పరిస్థితి మరీ దారుణంగా మారింది.
వచ్చిన మెసేజ్.. రాని గ్యాస్:
సిలిండర్ డెలివరీ అయినట్లు వినియోగదారుల మొబైల్ ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయని, కానీ తీరా ఏజెన్సీ వద్దకు వెళ్లి అడిగితే స్టాక్ లేదని సమాధానం చెబుతున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెసేజ్ వచ్చినప్పటికీ గ్యాస్ అందకపోవడం వెనుక ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందంటూ వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
పక్కదారి పడుతున్నాయా?:
గృహ అవసరాల కోసం వచ్చే సిలిండర్లను ఏజెన్సీ నిర్వాహకులు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని, అధిక ధరకు హోటళ్లు మరియు ఇతర కమర్షియల్ అవసరాలకు అమ్ముకుంటున్నారని కొందరు వినియోగదారులు ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి క్యూలో నిల్చున్నప్పటికీ సిలిండర్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, వెంటనే సివిల్ సప్లై అధికారులు స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
