
* నిద్రలో కూడా కేసీఆర్ పేరు తలుస్తున్నారు
* రేవంత్ పాలనలో నిధులు ఢిల్లీకి, ఏపీకి
* మాజీ మంత్రి హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమ గుర్తులు, చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao) ఆరోపించారు. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్లో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కేసీఆర్ పేరు తలవకుండా రేవంత్ ఉండలేరుని, నిద్రలో కూడా ఆయనకు కేసీఆరే గుర్తుకు వస్తున్నారని తెలిపారు. మన ఆత్మగౌరవ నినాదం తెలంగాణ అయితే రేవంత్ (Revanth)ఎందుకు అనలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అల్లు అర్జున్, బాలకృష్ణ కూడా జై తెలంగాణ అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా రాజీనామా చేశారని గుర్తుచేశారు. కిషన్ రెడ్డి(Kishanreddy), రేవంత్ రెడ్డి ఇద్దరే రాజీనామా చేయకుండా పారిపోయారని తెలిపారు. రేవంత్ రెడ్డి తన రాజీనామాను జిరాక్స్ పేపర్ మీద ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ తల్లిని మార్చారని, తెలంగాణ లోగోలో కాకతీయ తోరణం తీసేస్తానని అంటాడని చెప్పారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కూడా వేయలేదని అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో నిధులు ఢిల్లీకి, ఏపీకి వెళ్తున్నాయని అన్నారు. రేపటితరం యువకులుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
…………………………………………………..