
* సమస్యలు పట్టించుకునే స్థితిలేని బీజేపీ, కాంగ్రెస్
* రైతుల సమస్యలు పరిష్కరించాలి
* మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
ఆకేరున్యూస్, వరంగల్: కాంగ్రెస్ బూటకపు మాటలను నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ప్రజలకు రేవంత్‌రెడ్డి చుక్కలు చూపిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ప్రజలు, రైతుల కష్టాలు పట్టించుకునే స్థితిలో అటు బీజేపీగానీ, ఇటు కాంగ్రెస్ గానీ లేదని ఆయన ఆరోపించారు. జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను దయాకర్‌రావుతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు మిర్చి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. అబద్ధాలు చెప్పి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. బోగస్ మాటలు మాట్లాడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, అబద్ధాలు మాట్లాడడం మానుకో అని హెచ్చరించారు. రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ పూర్తి చేయకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లలో పెట్టుకుంటున్నారని విమర్శించారు. మిర్చి రైతును ఆదుకోవాలి, క్వింటాకు 25 వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మిర్చి రైతులను ఆదుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు రాజుల్లాగా బతికారని గుర్తు చేశారు. రైతులను అన్ని విధాలా ఆదుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
…………………………………………