
* ఊళ్లకు ఊళ్లు మంచాన పడుతున్నాయి..
* పాలనపై దృష్టి పెట్టని సర్కారు
* కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :కాంగ్రెస్ సర్కారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao) ఫైర్ అయ్యారు. ప్రజలు తిరగబడే రోజులు ఎంతో దూరం లేవని హెచ్చరించారు. తిట్టుడు బందు పెట్టి పాలనపై దృష్టి పెట్టకపోతే తప్పిలు తప్పవని అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్‌లో డెంగీ బారిన మృతి చెందిన కొనతం మహేష్ (34), న్యాయని శ్రావణ్ కుమార్ (16) కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు. తిమ్మాపూర్‌లో దాదాపు 60 కుటుంబాల వారు డెంగ్యూతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, అనేక మంది ప్రైవేట్ ఆస్పత్రిలో డబ్బులు పెట్టి వైద్యం చేసుకునే పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. కేసీఆర్ (KCR) ప్రభుత్వంలో పల్లె ప్రగతి కార్యక్రమం చేసి ఊరురా
ట్రాక్టర్ ట్రాలీ ఇచ్చి ప్రతి నెల గ్రామపంచాయతీకి నిధులు ఇచ్చేదని, నేడు పంచాయతీ సెక్రెటరీలు అప్పుల పాలై సమ్మె ప్రకటించే పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. పారిశుధ్యం సరిగా లేక ఊళ్లకు ఊర్లు మంచాన పడుతున్నాయని తెలిపారు. రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ.. ఎక్కడైనా ముఖ్యమంత్రి పర్యటించారా? కనీసం పారిశుద్ధ్యంపై సమీక్ష నిర్వహించారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మేల్కొని గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. గ్రామపంచాయతీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విష జ్వరాలు రాకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు నెలకి రూ.300 కోట్లు గ్రామపంచాయతీలకు ఇచ్చేవారు. రేవంత్ రెడ్డి (Revanthreddy) కనీసం పది పైసలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
…………………………………………….