* 1000 కోట్లతో వర్సిటీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తా
* పదేళ్లపాటు వర్సిటీని నిర్వీర్యం చేశారు
* ఓయూలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తనకు గొప్ప భాష రాకపోవచ్చునని, ప్రజల మనసు చదవడం వచ్చునని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోనే చదువుకున్నానని తెలిపారు. విద్యాలయాల్లో కుల వివక్ష ఉండకూడదనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉస్మానియా వర్సిటీని సందర్శించిన రేవంత్ అక్కడ కీలక ప్రసంగం చేశారు. యూనివర్సిటీకి రావాలంటే ధైర్యం కాదు, అభిమానం కావాలని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ లాంటి ఓయూను రూ. 1000 కోట్ల నిధులతో అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దే సంకల్పాన్ని వెల్లడించారు. ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నానని అంటే ఎందుకంత ధైర్యం చేస్తున్నావని తనను కొంతమంది అడిగారని, ఇక్కడకు రావాలంటే కావాల్సింది ధైర్యం కాదు.. అభిమానం అని తెలిపారు.
ప్రముఖులను అందించిన గడ్డ
పీవీ నర్సింహా రావు, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దర్ లాంటి గొప్ప వ్యక్తులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీదని రేవంత్ తెలిపారు. మన సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే తెలంగాణ సాధనతోనే జరుగుతుందని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నడుం బిగించారని, మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ముందు భాగాన నిలిచిందని అన్నారు. తెలంగాణ వస్తే మా తమ్ముల్లు ఎవరి ఆస్తులూ అడగలేదని, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే అడిగారని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో సమాన అవకాశాలు అందిస్తున్నామని రేవంత్ తెలిపారు. పేదలకు, నిస్సహాయులకు సహాయం అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశం అన్నారు.
అదే నా సంకల్పం
“చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే నా ఆకాంక్ష. నాకేం ఫామ్ హౌసులు లేవు.. నేనేం ప్రజల సొమ్ము దోచుకోలేదు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డా. రెండేళ్లల్లో మీరేం చేశారని కొందరు అడుగుతున్నారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని తొక్కిపెడితే రాష్ట్ర గీతంగా గుర్తించాం. పదేళ్లు తెలంగాణ తల్లి ఎట్లుంటదో అధికారికంగా గుర్తించలేదు. బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుని జాతికి అంకితం చేసుకున్నాం. ఎస్సీ వర్గీకరణ చేసి అమలు చేసి సామాజిక న్యాయం చేశాం. బీసీల లెక్క తేల్చేందుకు కులగణన చేశాం. కేంద్ర ప్రభుత్వం జనగణనతో కులగణన చేపట్టే పరిస్థితులు కల్పించాం. ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు. ఉన్నది ఉన్నట్టు చెబితే మమ్మల్ని విమర్శిస్తున్నారు. వాళ్లను నేను ఒక్కటే అడగదలచుకున్నా. వందల ఎకరాల్లో ఫామ్ హౌసులు కట్టుకున్నోళ్లు పదేళ్లలో దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు. భూమి లేకపోవడం పేదరికం కావచ్చు .. కానీ చదువు లేకపోవడం వెనుకబాటుతనం. విద్య ఒక్కటే వెనకబాటుతనం లేకుండా చేయగలుగుతుంది. ” అంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. డబ్బులు ఉన్నవాళ్లు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదువుకుంటారని, పేదలకు ఏదైనా చేయాలనేదే తన తపన అన్నారు. అందుకే రూ. 1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సంకల్పించినట్లు వివరించారు.
…………………………………………
